Irctc-Online-Luggage : ఆన్‌లైన్‌ రివ‌ల్యూష‌న్ Andhra Prabha Spl Story

Irctc-Online-Luggage : ఆన్‌లైన్‌ రివ‌ల్యూష‌న్ Andhra Prabha Spl Story

  • రైల్వేలో టికెట్ + లగేజీ బుకింగ్..
  • ఐఆర్‌సీటీసీలో షురూ
  • స్టేషన్‌లో లగేజీ ఇబ్బందులకు చెక్
  • పరిమితికి మించితే ఆన్‌లైన్‌లో నమోదు
  • రైలు ఎక్కే ముందు ప్రక్రియ పూర్తి..

( ఎన్టీఆర్ బ్యూరో ఆంధ్రప్రభ)

రైలు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసే మరో కీలక డిజిటల్ సేవను భారతీయ రైల్వే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే ఉచిత పరిమితికి మించిన లగేజీని కూడా ఆన్‌లైన్‌లో ఒకేసారి బుక్ చేసుకునే సౌకర్యం నేటి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో అదనపు సామగ్రి కోసం స్టేషన్‌లోని లగేజీ కార్యాలయాల వద్ద ప్రత్యేకంగా రుసుము చెల్లించి బుకింగ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ కొత్త విధానం ప్రయాణికులకు సమయాన్ని ఆదా చేయడంతో పాటు రైల్వే సేవలను మరింత పారదర్శకంగా, సాంకేతికంగా తీర్చిదిద్దనుంది.

Irctc-Online-Luggage : ముందుగానే బుక్ంగ్ …

ఇప్పటి వరకు ఉచితంగా అనుమతించే పరిమితికి మించి సామగ్రి తీసుకెళ్లే ప్రయాణికులు ప్రయాణానికి ముందుగానే రైల్వే స్టేషన్‌లోని లగేజీ బుకింగ్ కార్యాలయానికి వెళ్లి రుసుము చెల్లించి బుకింగ్ చేయాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో ఎక్కువ సమయం పట్టడంతో పాటు స్టేషన్‌కు ముందుగానే చేరుకోవాల్సిన పరిస్థితి ఉండేది. బుకింగ్ చేయకుండా అదనపు లగేజీతో ప్రయాణిస్తే తనిఖీ సమయంలో జరిమానాలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చేది. కొత్త విధానంలో ఐఆర్‌సీటీసీ ద్వారా కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలోనే అదనపు లగేజీ వివరాలను నమోదు చేసి రుసుము చెల్లించే అవకాశం కల్పించారు. లగేజీ బరువు, ఉచిత పరిమితి, అనుమతించే వస్తువులు, అదనపు బరువుపై వర్తించే రుసుములు, నిబంధనలు వంటి వివరాలు ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉండటంతో ప్రయాణికులు ముందుగానే తమ సామగ్రిని ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకోవచ్చు. నిర్దేశిత ఉచిత పరిమితిని మించిన లగేజీని ముందుగానే బుక్ చేయడం ద్వారా తనిఖీ సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉంటుంది. కొత్త వ్యవస్థలో బుక్ చేసిన అదనపు లగేజీ వివరాలను ఆన్‌లైన్‌లోనే పరిశీలించే అవకాశం కూడా కల్పించారు. దీంతో బుకింగ్ ప్రక్రియ మరింత వేగవంతంగా, పారదర్శకంగా మారనుంది.

Irctc-Online-Luggage : పరిమితంగా ఉచిత లగేజీ

ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ తదితర రిజర్వేషన్ తరగతుల్లో ఉచిత లగేజీ పరిమితులు యథావిధిగా అమల్లో ఉంటాయని, ఆ పరిమితికి మించి సామగ్రిని తీసుకెళ్లే వారు తప్పనిసరిగా నిబంధనల ప్రకారం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని అధికారులు సూచించారు. పరిమితికి మించి లగేజీని ప్రకటించకుండా తీసుకెళితే రైల్వే నిబంధనల ప్రకారం అదనపు రుసుము, జరిమానాలు విధించబడతాయని హెచ్చరించారు.

Irctc-Online-Luggage : ప్రయాణికులకు సౌకర్యవంతంగా…

ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా డిజిటల్ సేవలను విస్తరిస్తున్న భారతీయ రైల్వే, ఇటీవల టికెట్ బుకింగ్ వ్యవస్థను కూడా మరింత వేగవంతంగా, వినియోగదారులకు అనుకూలంగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టింది. టికెట్‌తోపాటు లగేజీ బుకింగ్ సదుపాయం కూడా అందుబాటులోకి రావడంతో ప్రయాణికుల అనుభవం మరింత సౌకర్యవంతంగా మారుతుందని రైల్వే అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.