నిండుకుండలా జలాశయం

ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు
ఒక్క రోజులో 7.5 అడుగులు పెరిగిన శ్రీశైలం నీటిమట్టం
1.51 లక్షల క్యూసెక్కులతో శ్రీశైలానికి వరద
శ్రీశైలం జలాశయంలో వేగంగా పెరుగుతున్న నిల్వలు
ఎగువ నుంచి భారీ వరద.. జలకళ సంతరించుకున్న శ్రీశైలం.
సంగమేశ్వరం ఆలయం చుట్టూ వరద నీరు.

కర్నూలు రూరల్ బ్యూరో/అమ్రాబాద్, ఆంధ్రప్రభ : ఎగువ ప్రాంతాల నుంచి కృష్ణా నదిలో వరద ప్రవాహం మరింత ఉద్ధృతంగా కొనసాగుతోంది. జూరాల స్పిల్‌వే ద్వారా భారీగా నీటి విడుదల కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయానికి శనివారం ఉదయం 1.51 లక్షల క్యూసెక్కుల వరద చేరుతోంది. దీంతో జలాశయ నీటిమట్టం ఒక్క రోజులో 7.50 అడుగులు పెరిగి, నిల్వలు దాదాపు 59.16 టీఎంసీలకు చేరాయి.

ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు వేగంగా పెరుగుతున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నాటికి శ్రీశైలం జలాశయం నీటిమట్టం 838.20 అడుగుల కు చేరుకుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం జలాశయంలో 59.1632 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

జలాశయానికి ప్రస్తుతం 1,51,366 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. ఇందులో జూరాల జలవిద్యుత్ కేంద్రం నుంచి 35,366 క్యూసెక్కులు, జూరాల స్పిల్‌వే ద్వారా 1,16,000 క్యూసెక్కులు చేరుతున్నాయి. సుంకేసుల, హంద్రీ, స్థానిక క్యాచ్‌మెంట్ ప్రాంతాల నుంచి ప్రస్తుతం ఎలాంటి ప్రవాహం లేదు. వాస్తవ (రియలైజ్డ్) ఇన్‌ఫ్లో 1,14,829 క్యూసెక్కులుగా నమోదైంది.

ఒక్క రోజులో భారీగా పెరిగిన నీటిమట్టం

శుక్రవారం ఉదయం జలాశయం నీటిమట్టం 830.70 అడుగులు, నిల్వ 50.2658 టీఎంసీలుగా ఉండగా, శనివారం ఉదయానికి 838.20 అడుగులకు, 59.1632 టీఎంసీలకు చేరుకుంది. అంటే 24 గంటల్లోనే 7.50 అడుగుల మేర నీటిమట్టం పెరగడంతో పాటు దాదాపు 8.90 టీఎంసీల నీరు జలాశయంలో చేరింది.

నీటి విడుదల స్వల్పమే

జలాశయం నుంచి ప్రస్తుతం నీటి విడుదల చాలా స్వల్పంగా కొనసాగుతోంది. ఎంజీకేఎల్‌ఐ (MGKLI) ద్వారా 1,600 క్యూసెక్కులు విడుదలవుతుంది.ఇక ఆవిరి రూపంలో 127 క్యూసెక్కుల నీటి నష్టం కలిపి మొత్తం సగటు అవుట్‌ఫ్లో 1,727 క్యూసెక్కులు మాత్రమే ఉంది. శ్రీశైలం జలాశయం కు వరద నీరు ఉ పొంగడంతో .. కొత్తపల్లి మండలం పరిధిలోని.. సంగమేశ్వర ఆలయం చుట్టూ.. నీళ్లు నిండుకున్నాయి.. ఈరోజు మధ్యాహ్నం లోగా గర్భగుడిలోకి.. కృష్ణా ప్రవాహం చేరుకోనుందని భావిస్తున్నారు

వర్షపాతం నమోదు
శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో గత 24 గంటల్లో 2.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

ఎగువ‌న కురుస్తున్న వ‌ర్షాల‌కు..

కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల కారణంగా శ్రీశైలం ప్రాజెక్టుకు వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే వారం రోజుల్లో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టు అధికార యంత్రాంగం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉన్నారు . దిగువ ప్రాంతాల ప్రజలు కూడా అధికారుల సూచనలు పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. రానున్న రోజుల్లో వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు.