జగన్మాతను దర్శించుకున్న ఆస్ట్రేలియా సహాయ మంత్రి..

జూలియన్ హిల్‌కు ఘన స్వాగతం పలికిన దుర్గ గుడి చైర్మన్ గాంధీ ఈవో శీనా నాయక్‌
అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన విదేశీ బృందం..


(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్ (సిటిజన్‌షిప్, కస్టమ్స్, మల్టీకల్చరల్ వ్యవహారాలు, అంతర్జాతీయ విద్యాశాఖ) శనివారం తన అధికారిక ప్రతినిధుల బృందంతో కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి శీనా నాయక్, దుర్గగుడి చైర్మన్ బొర్రాగాంధీ..
రాజగోపురం వద్ద మంగళవాయిద్యాలు, వేదమంత్రోచారణల మధ్య ఆస్ట్రేలియా ప్రతినిధుల బృందానికి స్వాగతం పలికారు. గర్భగుడిలో మూలవిరాట్ శ్రీ కనకదుర్గమ్మ దివ్య మంగళ రూపాన్ని దర్శించుకున్న జూలియన్ హిల్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం ఆలయ చరిత్ర, అమ్మవారి మహిమను వివరించగా వేదపండితులు వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో వి.కె. శీనా నాయక్ ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్‌కు శేషవస్త్రాలు, అమ్మవారి చిత్రపటం, దివ్య ప్రసాదాలను అందించి ఘనంగా సత్కరించారు.

అంతర్జాతీయ ప్రతినిధుల రాక నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీసులు ఇంద్రకీలాద్రి, ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, దేవస్థాన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.