పెడన 7వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ

పెడన, ఆంధ్రప్రభ : పెడన పట్టణం 7వ వార్డులో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రూ.1,000 పింఛన్ అందించడానికి ఐదేళ్ల సమయం తీసుకుందని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్‌ను రూ.4,000కు పెంచి అందిస్తున్నారని తెలిపారు.

రూ.4,000 పింఛన్ అందుకుంటున్న అవ్వా–తాతల కళ్లల్లో ఆనందం కనిపిస్తోందని, దివ్యాంగుల కుటుంబాల్లో ఆర్థిక భరోసా స్పష్టంగా కనిపిస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పింఛన్ పెంపుతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు నెలవారీ ఆర్థిక భద్రత మరింత బలపడిందన్నారు.

పేదలు, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి, బడుగు–బలహీన వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు, అధికారులు, వార్డు ప్రజలు, లబ్ధిదారులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.