వరదకు కొట్టుకుపోయిన పైప్‌లైన్

మంచిర్యాలకు తాగునీటి కష్టాలు

రాళ్లవాగులో వరద.. నీటి సరఫరా బంద్
పైప్‌లైన్ తెగి నీటి ఎద్దడి
మరమ్మతులు ప్రారంభించిన మున్సిపల్ అధికారులు

మంచిర్యాల, ఆంధ్రప్రభ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజలకు గోదావరి నది నుంచి తాగునీటిని సరఫరా చేసే ప్రధాన పైప్‌లైన్ రాళ్లవాగు వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో పట్టణంలో తాగునీటి ఎద్దడి నెలకొంది. రంగపేట–లక్ష్మీనగర్ మధ్య రాళ్లవాగుపై ఉన్న లో-లెవల్ వంతెన సమీపంలో ఏర్పాటు చేసిన పైప్‌లైన్ గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరద ఉద్ధృతికి దెబ్బతిని తెగిపోయింది. దీంతో పట్టణంలోని పలు ప్రాంతాలకు తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.

పైప్‌లైన్ పునరుద్ధరణ పనులు చేపట్టేందుకు మున్సిపల్ అధికారులు ప్రయత్నించినప్పటికీ, రాళ్లవాగులో ఉద్ధృతంగా ప్రవహించిన వరద కారణంగా పనులకు ఆటంకం ఏర్పడింది. శనివారం నీటి ప్రవాహం కొంత తగ్గుముఖం పట్టడంతో మరమ్మతు పనులను ప్రారంభించారు. ఇదిలా ఉండగా, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు విద్యుత్ సరఫరా కూడా పలుచోట్ల నిలిచిపోవడంతో బోరు బావుల ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తి చేసి మరో రెండు రోజుల్లో పట్టణానికి తాగునీటి సరఫరాను పునఃప్రారంభించేలా చర్యలు చేపట్టామని మున్సిపల్ అధికారులు తెలిపారు.