చర్చనీయాంశంగా ఎమ్మెల్యే స్టేటస్..

  • కొలికపూడి వాట్సాప్ స్టేటస్‌లో ఎంపీ చిన్ని ఫొటో..
  • ఏడాది తర్వాత ఎంపీ కేశినేని చిన్నితో కలిసి ఉన్న ఫొటోను స్టేటస్‌గా పెట్టుకున్న కొలికపూడి..
  • తెలుగు యువత నేత షేక్ హుస్సేన్‌కు జన్మదిన శుభాకాంక్షలతో ఆసక్తికర పోస్టు
  • ఇటీవలి కాలంలో ఎంపీ–ఎమ్మెల్యే విభేదాల నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యం సంతరించుకున్న స్టేటస్
  • గతంలో ఎంపీ ఫొటో లేకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన కొలికపూడి
  • తాజా పరిణామంపై తిరువూరు టీడీపీ వర్గాల్లో జోరుగా చర్చ

తిరువూరు ఆంధ్రప్రభ : తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వాట్సాప్ స్టేటస్ రాజకీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది. దాదాపు ఏడాది తర్వాత విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)తో కలిసి ఉన్న ఫొటోను వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకోవడం తిరువూరు తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల వరకు ఇరువురు నేతల మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ స్టేటస్‌కు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.

తెలుగు యువత ఉపాధ్యక్షుడు జన్మదినం సందర్భంగా…

తిరువూరు నియోజకవర్గ తెలుగు యువత ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వాట్సాప్ స్టేటస్‌లో ఒక ఫొటోను పోస్టు చేశారు. ఆ ఫొటోలో మధ్యలో ఎమ్మెల్యే కొలికపూడి ఉండగా, ఒకవైపు ఎంపీ కేశినేని చిన్ని, మరోవైపు షేక్ హుస్సేన్ నిలబడి ఒకరి భుజాలపై ఒకరు చేతులు వేసుకున్న దృశ్యం కనిపించింది. గత కొంతకాలంగా ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు ఉన్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగింది. ఆ సమయంలో నిర్వహించిన పలు పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎంపీ ఫొటో లేకుండానే ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడం రాజకీయంగా చర్చకు దారితీసింది. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా ఎమ్మెల్యే వాట్సాప్ స్టేటస్‌లో ఎంపీ చిన్ని ఫొటో కనిపించడంతో తిరువూరు టీడీపీ శ్రేణుల్లో కొత్త చర్చ మొదలైంది. ఇది కేవలం షేక్ హుస్సేన్ జన్మదిన శుభాకాంక్షలకే పరిమితమైన పోస్టా, లేక ఇరువురు నేతల మధ్య సంబంధాల్లో మార్పునకు సంకేతమా అన్న అంశంపై పార్టీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ స్టేటస్‌పై ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు లేదా ఎంపీ కేశినేని చిన్ని నుంచి ఎలాంటి అధికారిక వ్యాఖ్య వెలువడలేదు. దీంతో వాట్సాప్ స్టేటస్ చుట్టూ నెలకొన్న రాజకీయ చర్చ కొనసాగుతోంది.