MS Raju | గెట్ రెడీ అగధ వచ్చేస్తోంది..!
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: ఒకప్పుడు సంక్రాంతి వచ్చిందంటే చాలు ఆయన తీసిన సినిమా ఖచ్చితంగా ఉండాల్సిందే.. ప్రతి పండగకి ఓ సినిమాను నిర్మిస్తూ.. సంక్రాంతి రాజుగా వెలుగొందిన నిర్మాత ఎంఎస్ రాజు. ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆయన. చతరువాత దర్శకుడిగా మారి తూనీగ..తూనీగ, డర్టీ హరి, 7 డేస్ 6 నైట్స్ అనే సినిమాలు తీశారు.
ఇప్పుడు అతీంద్రియ శక్తులు, పురాణాల మేళవింపుతో రూపొందిన ‘అగధ’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై అంచనాలు ఆమాంతం పెంచేశాయి. ఇప్పుడు చిత్రబృందం తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ను ప్రకటించింది.
ఆగస్టు 3 మధ్యాహ్నం 12 గంటలకు ‘అగధ’ ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. “మరచిపోలేని హారర్, సూపర్‌నేచురల్, మిథికల్ ప్రపంచంలోకి ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. చీకటిలోకి అడుగుపెట్టి ఇప్పటివరకు ఎప్పుడూ అనుభవించని భయాన్ని ఆస్వాదించండి” అంటూ చిత్రబృందం సినిమాకు సంబంధించన పోస్టర్ ను సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
హారర్‌తో పాటు అతీంద్రియ శక్తులు, పురాణాల నేపథ్యంలో సాగే ఈ చిత్రంపై ఇప్పటికే సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. థ్రిల్లింగ్ కథాంశం, విజువల్ ఎఫెక్ట్స్, మిస్టరీ అంశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని మేకర్స్ చెబుతున్నారు.
‘అగధ’ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమాలో కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. కాగా ఈ సినిమాను తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో మేకర్స్ విడుదల చేయనున్నారు.
