రేపటి నుంచి బోనోత్స‌వం

శ్రీ ఆంథోల్ మైసమ్మ ఆల‌యంలో ఏర్పాట్లు

ఆగస్టు 1 నుంచి 3 వరకు 21వ బోనాల జాతర
భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన దేవస్థానం

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండు మల్కాపురం గ్రామంలోని శ్రీ ఆంథోల్ మైసమ్మ దేవస్థానంలో 21వ బోనాల జాతర ఉత్సవాలు ఆగస్టు 1 నుంచి 3 వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు దేవస్థానం చైర్మన్ కంచర్ల అశ్విన్‌రెడ్డి, కార్యనిర్వాహణాధికారి ఎస్. మోహన్‌బాబు తెలిపారు. ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు.

ఆగస్టు 1న అఖండ దీపారాధన, గణపతి పూజ, పుణ్యాహవాచనం, లలితా సహస్రనామార్చన, సప్తశతి హోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఆగస్టు 2న భక్తుల బోనాలు, చండీహోమం, అన్నదానం నిర్వహించడంతో పాటు సాయంత్రం శ్రీ ఆంథోల్ మైసమ్మ, శ్రీ ఉప్పలమ్మ, శ్రీ ఎల్లమ్మ అమ్మవార్ల ఉత్సవ విగ్రహాల గ్రామసేవ రథోత్సవం ఘనంగా సాగనుంది. ఆగస్టు 3న గణపతి పూజ, సామూహిక కుంకుమార్చనలు, పూర్ణాహుతి అనంతరం అన్నదానంతో ఉత్సవాలు ముగియనున్నాయి.

ఈ వేడుకలకు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరుకానున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, ఉత్సవాలను విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవస్థానం ధర్మకర్తల మండలి తెలిపింది.