‘మళ్లీ కలిసి పోరాడుదాం రా సోదరుడా’..
పెద్ది జ్ఞాపకాలతో భావోద్వేగానికి గురైన వినయ్ భాస్కర్
పెద్ది సుదర్శన్‌రెడ్డిని తలుచుకుని కన్నీరుమున్నీరైన మాజీ ఎమ్మెల్యే
కుటుంబానికి కేసీఆర్‌తో పాటు బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని భరోసా
ఉమ్మడి వరంగల్ బ్యూరో, ఆంధ్రప్రభ: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ఉద్యమంలో కలిసి నడిచిన రోజులను స్మరించుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.
“తెలంగాణ కోసం చచ్చేదాకా పోరాడుదాం అన్నావు.. ఓరుగల్లుకు మంచి చేద్దామని కలలు కన్నాం. కానీ మధ్యలోనే మమ్మల్ని విడిచి వెళ్లిపోయావా సోదరుడా” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమ సమయంలో పోలీసులు చేసిన లాఠీచార్జీలను “ఉద్యమ గుర్తులు”గా భావించేవాడివని, కేసులు, జైళ్లు, కోర్టులు ఉద్యమంలో భాగమేనని ధైర్యం చెప్పేవాడివని గుర్తుచేశారు. “కేసీఆర్ సైనికులం.. ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గం అని చెప్పిన నువ్వు విధికి ఎలా తలొగ్గావు సోదరుడా” అంటూ భావోద్వేగానికి గురయ్యారు. పార్టీకి, కేసీఆర్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని కలిసి నిర్ణయించుకున్నామని, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తమ ఇద్దరికీ సొంత ఇళ్లు లేవని, ఇటీవలే తనను ఇల్లు ఎప్పుడు కడతావని అడిగిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయని వినయ్ భాస్కర్ చెప్పారు.
“నువ్వు లేని ఉద్యమాన్ని, రాజకీయాన్ని ఊహించలేను. నిన్ను కోల్పోవడం నాకు వ్యక్తిగతంగా తీరని లోటు” అని పేర్కొన్నారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబానికి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్‌ఎస్ కుటుంబం వారి వెంటే నిలుస్తుందని వినయ్ భాస్కర్ భరోసా ఇచ్చారు.
