ప్రతి ఇంటా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి

జలసిరి కార్యక్రమంతో భూగర్భ జలాల పరిరక్షణకు ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపు

భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్ మండలంలోని బడా భీమ్‌గల్ గ్రామంలో జల సంరక్షణ, వర్షపు నీటి నిల్వ, భూగర్భ జలాల పరిరక్షణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో గురువారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ ఎం. కిరణ్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు గ్రామ పాలకవర్గం, గ్రామ ప్రజలతో కలిసి జలసిరి కార్యక్రమంపై ప్రతిజ్ఞ చేయించారు.

ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం. కిరణ్ కుమార్, సర్పంచ్ విష్ణువర్ధని మాట్లాడుతూ ప్రతి ఇంటి వద్ద వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సోక్‌పిట్స్ లేదా మ్యాజిక్ సోక్‌పిట్స్ నిర్మించుకోవాలని గ్రామస్తులకు సూచించారు. రైతులు తమ వ్యవసాయ పొలాల్లో వర్షపు నీటిని నిల్వ చేసేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.

గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఊట గుంటలు, కమ్యూనిటీ ఊట గుంటలు నిర్మించాలని, భూగర్భ జలాల పెంపుదలకు బోరుబావుల వద్ద రీఛార్జ్ స్ట్రక్చర్లు ఏర్పాటు చేయడం అవసరమని వివరించారు. ఈ చర్యల ద్వారా వర్షపు నీరు భూమిలోకి ఇంకి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని, భవిష్యత్ తరాలకు నీటి వనరులను సంరక్షించవచ్చని గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.

అలాగే ప్రతి ఇంటిలో నాలుగు రకాల చెత్త డబ్బాలను ఏర్పాటు చేసి, చెత్తను వేర్వేరుగా సేకరించి గ్రామ పంచాయతీ ట్రాక్టర్ వచ్చినప్పుడు అందజేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ మల్లేష్, గ్రామ కార్యదర్శి సీహెచ్ రాహుల్, గ్రామ కమిటీ అధ్యక్షుడు పిట్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాగుల గంగామోహన్, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లు, ఐకేపీ వీవోలు, కారోబార్ నర్సయ్య, శేఖర్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.