భారీ వర్షాలతో ఎండపల్లిలో జనజీవనం అస్తవ్యస్తం
ఎండపల్లి, ఆంధ్రప్రభ: జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ఎండపల్లి మండలంలో జనజీవనం అస్తవ్యస్తమైంది. మారేడుపల్లి గ్రామంలోని 3వ వార్డులోని లోతట్టు కాలనీ పూర్తిగా జలమయమవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండపల్లి–కొండాపూర్ గ్రామాల మధ్య ఉన్న వంతెనపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అలాగే అంబరిపేటకు వెళ్లే రహదారిపై కూడా నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.
మరోవైపు, రాజారాంపల్లి గ్రామ సమీపంలోని కరీంనగర్–రాయపట్నం రాష్ట్ర రహదారిపై భారీ వర్షాలకు చెట్టు కూలిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అనంతరం స్థానికులు చెట్టును తొలగించడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. భారీ వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద నీరు ప్రవహిస్తున్న వంతెనలు, రహదారులపై ప్రయాణించవద్దని అధికారులు సూచించారు.
