కాళేశ్వరం జలాలతో మళ్లీ జలకళ

  • నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల మోటార్ల ప్రారంభం
  • మానేరు డ్యామ్‌కు గోదావరి జలాలు
  • రైతుల్లో ఆశలు చిగురింపు

పెద్దపల్లి/కరీంనగర్, ఆంధ్రప్రభ : కాళేశ్వరం ప్రాజెక్టులోని నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల మోటార్లను బుధవారం ప్రారంభించడంతో గోదావరి జలాలు మళ్లీ మానేరు వైపు పరుగులు తీశాయి. దీంతో కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతుల్లో ఖరీఫ్ సాగుపై కొత్త ఆశలు చిగురించాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారంలోని నంది పంప్‌హౌస్ నుంచి నీటి ఎత్తిపోతలను అధికారులు ప్రారంభించారు. నాలుగు మోటార్లను ఒకేసారి ప్రారంభించి గోదావరి జలాలను నంది రిజర్వాయర్‌కు పంపింగ్ చేస్తున్నారు. ఒక్కో మోటార్ ద్వారా 3,150 క్యూసెక్కులు, మొత్తం నాలుగు మోటార్ల ద్వారా 12,600 క్యూసెక్కుల నీటిని ఓపెన్ డెలివరీ సిస్టమ్ ద్వారా ఎత్తిపోస్తున్నారు.

నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల ద్వారా గోదావరి జలాలు ఎత్తిపోతలు ప్రారంభం కావడంతో లోయర్ మానేరు డ్యామ్ (ఎల్‌ఎండీ)కు జలకళ సంతరించుకుంది. మానేరు జలాశయంలోకి నీరు చేరుతుండటంతో కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లోయర్ మానేరు డ్యామ్‌ను సందర్శించి, రైతులకు సాగునీటి భరోసా కల్పించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టులోని పంప్‌హౌస్‌ల మోటార్లను వెంటనే ప్రారంభించి మానేరు డ్యామ్‌ను నింపాలని ప్రభుత్వానికి సూచించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో నంది, గాయత్రి పంప్‌హౌస్‌ల మోటార్లు ప్రారంభం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ పరిణామం ఊరటనిచ్చింది. ఖరీఫ్ సాగుకు అవసరమైన నీటి కొరత లేకుండా కాళేశ్వరం జలాల తరలింపును నిరంతరం కొనసాగించి, మానేరు డ్యామ్‌ను పూర్తిస్థాయిలో నింపాలని రైతులు కోరుతున్నారు.