విత్తనం నాటిన ప్రతి రైతుకు ఫసల్ బీమా..!
- రైతుల ఆర్థిక భద్రతకు పథకంలో 100 శాతం నమోదు అవసరం..
- ప్రతి శాఖ సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను సాధించాలి
- సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమల్లో జిల్లాను ముందంజలో నిలపాలి
- జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, ఆంధ్రప్రభ: జిల్లాలో రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి, ప్రజారోగ్యం, వరదల నివారణ, రెవెన్యూ సేవలు, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో నిర్దేశించిన లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ లక్ష్మీశ.. జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లాస్థాయి అధికారులతో కలసి కలెక్టర్ కార్యాలయం నుంచి ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల క్షేత్రస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన కింద విత్తనం నాటిన ప్రతి రైతును తప్పనిసరిగా పంటల బీమా పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేశారు. జిల్లాలో 100 శాతం నమోదు లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పంట మార్పిడి (క్రాప్ డైవర్సిఫికేషన్)పై ప్రతి మండల వ్యవసాయ అధికారి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని, ఇప్పటి వరకు ఎంతమంది రైతులు ఎంత విస్తీర్ణంలో పంట మార్పిడి చేపట్టారో సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అమలులో ఎదురవుతున్న సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించాలన్నారు.
జిల్లాలో ఎరువుల లభ్యత, పంపిణీపై ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. మండల వ్యవసాయ అధికారులు ప్రతిరోజూ కనీసం రెండు నుంచి మూడు ఎరువుల దుకాణాలను తనిఖీ చేయాలని స్పష్టం చేశారు. రైతులకు సమస్యలు ఎదురైతే కలెక్టరేట్ యూనిఫైడ్ కాల్ సెంటర్ (91549 70454)ను సంప్రదించే విధంగా అన్ని ఎరువుల దుకాణాల వద్ద హెల్ప్‌లైన్ నంబర్‌ను స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. వర్షాలు ఆలస్యమైన పరిస్థితుల్లో సీడ్ పెల్లెటింగ్‌ను ప్రతి రైతుకు విస్తృతంగా అమలు చేయాలని, ఇది కేవలం ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే కాకుండా అందరికీ వర్తించే సాంకేతిక విధానమని వివరించారు. సీడ్ పెల్లెటింగ్ వల్ల మొలక శాతం మెరుగుపడటంతో పాటు తక్కువ వర్షపాతం పరిస్థితుల్లో కూడా విత్తనం సురక్షితంగా ఉంటుందని తెలిపారు. రైతులకు అవసరమైన శిక్షణ అందించాలని ఆదేశించారు.
హరిత విస్తీర్ణంపై దృష్టి పెట్టండి..
నెట్ జీరో’ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. మొదట సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు, హాస్టళ్లలో ప్రారంభించి అనంతరం అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు విస్తరించాలని సూచించారు. గ్రామపంచాయతీలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాలను హరితవనాలుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. జిల్లా యంత్రాంగం మొత్తం ఒకే బృందంలా పనిచేయాలని, అధికారులు తమ శాఖలకే పరిమితం కాకుండా జిల్లా అభివృద్ధి లక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని సమన్వయంతో వ్యవహరించాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలులో జిల్లాను ముందు వరుసలో నిలపడానికి కృషి చేయాలని కలెక్టర్ లక్ష్మీశ దిశానిర్దేశం చేశారు. వరద పరిస్థితులను ఎదుర్కొనేందుకు సన్నద్ధత, 22ఏ దరఖాస్తుల పరిష్కారం తదితరాల పైనా కలెక్టర్ అధికారులకు సూచనలు చేశారు.
