ఐఐటీ కోల్‌కతాలో హైద‌రాబాద్ ప్రొఫేస‌ర్ మృతి…

కోల్‌కతా/ఖరగ్‌పూర్, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్‌లోని ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న దీపక్ రెడ్డి పుల్లగురం (36) మృతదేహం బుధవారం క్యాంపస్‌లోని ఆయన నివాస గృహంలో లభ్యమైంది. ఆయన స్వస్థలం హైదరాబాద్ అని పోలీసులు తెలిపారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఉదయం నుంచి దీపక్ స్పందించకపోవడంతో సహచరులు అధికారులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం సుమారు 12.30 గంటలకు హిజ్లీ అవుట్‌పోస్ట్ పోలీసులు భద్రతా సిబ్బంది సహాయంతో క్వార్టర్స్‌లోకి వెళ్లగా, ఆయన ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. వెంటనే ఆయనను ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని బి.సి. రాయ్ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనలో ఆత్మహత్యా? లేక మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన స్థలంలో ఆత్మహత్యా లేఖ లభించిందా లేదా అనే విషయంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. నివాసాన్ని సీజ్ చేసి, అక్కడి నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు.

హైదరాబాద్‌లో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం అందించిన పోలీసులు, సహోద్యోగులు, భద్రతా సిబ్బంది, ఇతర నివాసితులను విచారిస్తున్నారు. వ్యక్తిగత లేదా ఉద్యోగ సంబంధిత సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఎస్పీ పాపియా సుల్తానా మాట్లాడుతూ, ప్రొఫెసర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, పోస్టుమార్టం అనంతరం మరణానికి గల కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందన్నారు.

ఇదిలా ఉండగా, ఈ ఘటనపై ఐఐటీ ఖరగ్‌పూర్ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్యలు చోటుచేసుకున్నప్పటికీ, క్యాంపస్‌లో ఓ అధ్యాపకుడు ఈ విధంగా మృతి చెందడం ఇదే తొలిసారి అని సంస్థ వర్గాలు పేర్కొంటున్నాయి.