పరిశోధనాత్మక విద్యతోనే ఉన్నత శిఖరాలు చేరుకోవాలి: మనోజ్ సిన్హా
ఖమ్మంలో కాన్‌రాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యా–ఆధ్యాత్మిక ఉత్సవంలో పాల్గొన్న జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్
ఖమ్మం ఎడ్యుకేషన్, ఆంధ్రప్రభ: పరిశోధనాత్మక విద్యతోనే విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అన్నారు. ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో ఉన్న కాన్‌రాయ్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో బుధవారం నిర్వహించిన విద్యా, ఆధ్యాత్మిక ఉత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ సందర్భంగా మనోజ్ సిన్హా మాట్లాడుతూ బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికి, అభ్యాసన సామర్థ్యాలను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ప్రతి అంశాన్ని పరిశోధనాత్మక దృక్పథంతో అధ్యయనం చేసి చదువుల్లో రాణించాలని, సమాజంలోని సమస్యలకు పరిష్కారాలు చూపే బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని పిలుపునిచ్చారు.
చదువుతో పాటు అన్ని రంగాల్లో సర్వతోముఖ అభివృద్ధి సాధించాలని, లభించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాఠశాల, తల్లిదండ్రులు, గురువులు, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు.
స్కూల్ చైర్మన్ నామా తరుణ్ చిన్న వయస్సులోనే తన నాయనమ్మ నామా వరమ్మ పేరు మీద లాభాపేక్ష లేకుండా విద్యాసంస్థను నిర్వహించడం అభినందనీయమని మనోజ్ సిన్హా కొనియాడారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగి సమాజానికి ఉపయోగపడే పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
అంతకుముందు లెఫ్టినెంట్ గవర్నర్‌కు జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, స్కూల్ చైర్మన్ నామా తరుణ్ తదితరులు పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. కేరళకు చెందిన ప్రత్యేక బ్యాండ్ వాయిద్యాలు, వేద పండితుల పూర్ణకుంభ స్వాగతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
స్కూల్ ఆవరణలోని ఏకశిల గణపతి విగ్రహానికి మనోజ్ సిన్హా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎఫ్‌ఎం పోడ్‌కాస్ట్ స్టూడియోను ప్రారంభించి, స్కూల్ న్యూస్‌లెటర్‌ను ఆవిష్కరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి, ఇన్వెస్టిచర్ సెరిమనీలో విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేశారు. పాఠశాల ఆవరణలో వేప మొక్కను నాటి పర్యావరణ పరిరక్షణపై సందేశం ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మధు, స్కూల్ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, నామా శ్రేయోభిలాషులు, వైద్యులు, న్యాయవాదులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమాలను స్కూల్ చైర్మన్ నామా తరుణ్ పర్యవేక్షించారు.
