జలమయం.. డబుల్ బెడ్‌రూం కాలనీ

వర్షపు నీటితో ఇబ్బందులు.. సహాయక చర్యలు చేపట్టిన మున్సిపల్ అధికారులు

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పెద్దపల్లి శివారులోని రాంపల్లి డబుల్ బెడ్‌రూం కాలనీ జలమయమైంది. కాలనీలోని రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోవడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

కాలనీలో నీరు నిల్వ ఉండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితిని తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ నూగిల్ల మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

వెంటనే వర్షపు నీటిని తొలగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నీరు త్వరగా వెళ్లిపోయేలా పారుదల పనులు నిర్వహించి, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.

వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని అధికారులు సూచించారు.