తిరుపతిలో ‘ఇంటింటికి తెలుగుదేశం’కు విశేష స్పందన

ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమం చేరేలా అవగాహన కల్పిస్తున్నాం: డాక్టర్ పనబాక లక్ష్మి

తిరుపతి, ఆంధ్రప్రభ: తిరుపతి నియోజకవర్గ పరిధిలోని క్లస్టర్-3, వార్డు-26లో బుధవారం నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. తిరుపతి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేబీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు డాక్టర్ పనబాక లక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కార్యక్రమానికి విచ్చేసిన నాయకులకు స్థానికులు హారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా డాక్టర్ పనబాక లక్ష్మి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం “ప్రతి ఇంటికి – ప్రతి కుటుంబానికి ప్రభుత్వం” అనే లక్ష్యంతో పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా పార్టీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయని తెలిపారు.

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు స్థానికులు స్పందిస్తూ, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయని, ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్‌చార్జ్ పులిగోరు మురళి, క్లస్టర్ నాయకులు, వార్డు నాయకులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.