వరద బాధితులకు భరోసాగా కన్నాయిగూడెం ఎస్సై
మోకాళ్ల లోతు నీటిలోకి వెళ్లి సహాయక చర్యలు.. మానవత్వం చాటిన పోలీసు సేవలు
కన్నాయిగూడెం, ఆంధ్రప్రభ: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామం వరద నీటిలో చిక్కుకుంది. గ్రామంలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సమాచారం అందుకున్న వెంటనే కన్నాయిగూడెం ఎస్సై వెంకటేష్ పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజలతో కలిసి గ్రామానికి చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. మోకాళ్ల లోతు నీటిలోనే బాధితుల ఇళ్లకు వెళ్లి వారి పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ ఎలాంటి ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.

బాధితుల ఇంటి సామగ్రి, నిత్యావసర వస్తువులు నీటిలో కొట్టుకుపోకుండా ట్రాక్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులను ముందుగా సురక్షిత ప్రాంతాలకు తరలించి, ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎస్సై వెంకటేష్ మాట్లాడుతూ ప్రజల ప్రాణాల రక్షణే పోలీసు శాఖకు అత్యంత ప్రాధాన్యమని అన్నారు. వర్షాలు తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.
అత్యవసర పరిస్థితుల్లో పోలీసు శాఖ ప్రజలకు అండగా ఉంటుందని, ఎలాంటి సహాయం అవసరమైనా వెంటనే అందిస్తామని తెలిపారు. వరద కష్టకాలంలో కన్నాయిగూడెం ఎస్సై చూపిన చొరవ, మానవత్వంతో కూడిన సేవలను గ్రామస్థులు అభినందించారు.
