ఉపాధ్యాయుల సేవలకు వందనం
గురు పౌర్ణమి వేళ గురువులకు ఘన సన్మానం
కడెం, జూలై 29 (ఆంధ్రప్రభ): గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం నిర్వహిస్తున్న ఇంటిగ్రేటెడ్ ఉపాధ్యాయుల శిక్షణ తరగతుల్లో గురువులను ఘనంగా సన్మానించారు. జ్ఞానాన్ని పంచే గురువుల సేవలను స్మరించుకుంటూ శిక్షణలో పాల్గొన్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు గురుపూజ నిర్వహించి వారికి శాలువాలు కప్పి సత్కరించారు.
శిక్షణ కార్యక్రమం మూడో రోజు గురు పౌర్ణమి వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్పీలు బి. మహేశ్వర్, కే. నరేష్, మానసలను పాఠశాల ప్రధానోపాధ్యాయులు కూచనపల్లి శ్రీనివాస్, శ్రీశైలం, టి. వనిత, లావణ్య, సునంద, లక్ష్మిలు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయుడు కూచనపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, గురువు సమాజ నిర్మాణానికి మూలస్తంభమని పేర్కొన్నారు. విద్యార్థుల్లో జ్ఞానం, విలువలు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. గురువులను గౌరవించడం భారతీయ సంస్కృతిలో గొప్ప సంప్రదాయమని, గురు పౌర్ణమి ఆ భావనను మరింత బలపరుస్తుందని వివరించారు.
శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులు కూడా గురువుల సేవలను స్మరించుకుంటూ గురు పౌర్ణమి ప్రాముఖ్యతను చర్చించారు. ఉపాధ్యాయ వృత్తి కేవలం ఉద్యోగం కాదని, భావితరాల భవిష్యత్తును తీర్చిదిద్దే మహత్తర బాధ్యత అని అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ తరగతులకు హాజరైన ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురుపూజలో భాగస్వాములయ్యారు.
