భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

అత్యవసర పరిస్థితుల్లో పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ సతీష్ సూచన

చిట్యాల, ఆంధ్రప్రభ: మండలంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చిట్యాల ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ కోరారు.

బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వస్తే వాహనాలను నెమ్మదిగా నడుపుతూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.

వాగులు, వంకలు, చెరువుల వద్దకు వెళ్లకూడదని, విద్యుత్ స్తంభాలు, తెగిపోయిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు.

ఏదైనా అత్యవసర పరిస్థితి ఎదురైతే వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్‌ను లేదా 100కు డయల్ చేసి సమాచారం అందించాలని ఎస్‌ఐ పోచంపల్లి సతీష్ కోరారు.