గురు పౌర్ణమి వేళ కొండగట్టు అంజన్న సన్నిధిలో మంత్రుల ప్రత్యేక పూజలు

రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని వేడుకున్న ప్రజాప్రతినిధులు

కొండగట్టు ఆంధ్రప్రభ: గురు పౌర్ణమి పర్వదినం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి సన్నిధి భక్తజన సందోహంతో కళకళలాడింది. కోరిన కోర్కెలు తీర్చే ఇలవేల్పు దైవంగా భక్తుల ఆరాధనలు అందుకుంటున్న కొండగట్టు అంజన్నను రాష్ట్ర మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

గురు పౌర్ణమి సందర్భంగా ముందుగా కొండగట్టు గిరి ప్రదక్షిణ నిర్వహించిన ప్రజాప్రతినిధులు అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక అర్చనలు, పూజల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని అంజన్నను వేడుకున్నారు.

ప్రత్యేక పూజల అనంతరం ఆలయ అర్చకులు మంత్రులకు వేదాశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదం, శేషవస్త్రాలతో సత్కరించారు. ఆలయ ప్రాంగణం అంతా “జై శ్రీ ఆంజనేయ”, “జై అంజన్న” నామస్మరణలతో మార్మోగింది.

ఈ కార్యక్రమంలో కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గురు పౌర్ణమి కావడంతో రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తెలంగాణలో ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరుగాంచిన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో గురు పౌర్ణమి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొనగా, ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించారు. స్వామివారి కటాక్షంతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని భక్తులు మనసారా ప్రార్థించారు.