శరీరంలో ‘కార్టిసాల్’ పెరిగితే ప్రమాదమే
దీర్ఘకాలిక ఒత్తిడి మధుమేహానికి దారి
ఆంధ్రప్రభ : నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఒత్తిడి సర్వసాధారణమైపోయింది. అయితే, ఈ దీర్ఘకాలిక ఒత్తిడి మధుమేహానికి దారితీస్తుందని ఎండోక్రైనాలజిస్ట్, ఎండోరుమా కేర్ కన్సల్టెంట్ డాక్టర్ దీప్తి కొండగారి హెచ్చరిస్తున్నారు. తరచుగా అలసట, నిద్రలేమి, మూడ్‌లో మార్పులు, ఆకస్మికంగా బరువు పెరగడం వంటి లక్షణాలను కేవలం జీవనశైలి లోపాలుగా కొట్టిపారేయకూడదని, ఇవి శరీరంలో ‘కార్టిసాల్’ అనే స్ట్రెస్ హార్మోన్ పెరుగుదలకు సంకేతాలని ఆమె స్పష్టం చేశారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన మెటబాలిక్ సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
దీర్ఘకాలిక ఒత్తిడితో ఎలా ముప్పు వస్తుందంటే..
ట్రాఫిక్ సమస్యల నుంచి ఆఫీసులో టార్గెట్ల వరకు నిత్యం ఎదుర్కొనే ఒత్తిడి తీవ్రమైనప్పుడు, మెదడు కార్టిసాల్ హార్మోన్‌ను ఎక్కువగా విడుదల చేస్తుంది. ఇది దీర్ఘకాలం పాటు కొనసాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగడంతో పాటు, క్రమంగా ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. శరీరంలో కార్టిసాల్ ప్రవహించినప్పుడు, అది సాధారణ జీర్ణక్రియను నెమ్మదించి.. కొవ్వును కరిగించే ప్రక్రియను వేగవంతం చేసి, రక్తంలో గ్లూకోజ్ పరిమాణాన్ని పెంచుతుంది.
సాధారణంగా ఒత్తిడి తగ్గిన తర్వాత కార్టిసాల్ ఉత్పత్తి తగ్గిపోయి శరీరం సాధారణ స్థితికి చేరుకోవాలి. కానీ, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల ఈ హార్మోన్ స్థాయిలు తగ్గకుండా అలాగే ఉండిపోయి మధుమేహానికి కారణమవుతున్నాయి. డయాబెటిస్ అదుపులో లేని వారిలో ఈ కార్టిసాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
లక్షణాలను బట్టి సొంత వైద్యం వద్దు.. పరీక్షలు అవసరం
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా కార్టిసాల్‌పై ప్రజల్లో అవగాహన పెరుగుతున్నప్పటికీ, కేవలం పొట్ట చుట్టూ బరువు పెరగడం లేదా అలసట వంటి సాధారణ లక్షణాలను బట్టే ఇది కార్టిసాల్ సమస్యే అని సొంతంగా నిర్ధారణకు రాకూడదని డాక్టర్ దీప్తి సూచిస్తున్నారు. డయాబెటిస్‌కు కారణమయ్యేంతగా కార్టిసాల్ శరీరంలో ఉందో లేదో తెలుసుకోవడానికి వైద్యుల పర్యవేక్షణలో కచ్చితమైన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి.
మధుమేహం, కార్టిసాల్ వ్యవస్థలు శరీరంలో ఒకదానికొకటి సంక్లిష్టంగా ముడిపడి ఉంటాయి. కాబట్టి, డయాబెటిస్‌ను నివారించాలన్నా, అదుపులో ఉంచుకోవాలన్నా కేవలం మందులు వాడటమే కాకుండా.. ఒత్తిడిని జయించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం వంటి సమగ్రమైన విధానాన్ని పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
