తమ్మడి కుంట చెరువు వద్ద మద్దతు ర్యాలీ
‘హైడ్రా ఉండాల్సిందే’ అంటూ నినాదాలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాలనీవాసులు హైడ్రాకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించారు. శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని తమ్మడి కుంట చెరువు వద్ద జరిగిన ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొని హైడ్రా కొనసాగాలని డిమాండ్ చేశారు. “హైడ్రా ఉండాల్సిందే”, “చెరువులను కాపాడాలి”, “ప్రజా ఆస్తులను పరిరక్షించాలి” అంటూ నినాదాలతో పరిసరాలు మార్మోగాయి.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ పాల్గొని ర్యాలీకి సంఘీభావం తెలిపారు. ప్రజా ఆస్తుల పరిరక్షణ, చెరువుల సంరక్షణ కోసం చేపడుతున్న చర్యలకు ప్రజల మద్దతు ఉండటం అభినందనీయమని వారు పేర్కొన్నారు.
ర్యాలీ సందర్భంగా కురిసిన వర్షాన్ని కూడా ప్రజలు లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో పాల్గొనడం విశేషంగా నిలిచింది. చేతుల్లో ప్లకార్డులు, బ్యానర్లతో తమ్మడి కుంట చెరువు చుట్టూ ర్యాలీ నిర్వహించిన కాలనీవాసులు హైడ్రా చర్యల వల్ల వర్షాకాలంలో గతంతో పోలిస్తే ఇబ్బందులు తగ్గాయని పేర్కొన్నారు.
హైడ్రా కమిషనర్ ఏ.వీ. రంగనాథ్ చేపడుతున్న చెరువులు, నాలాలు, ప్రభుత్వ భూముల పరిరక్షణ చర్యలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని కాలనీవాసులు ప్రకటించారు. నగర అభివృద్ధితో పాటు భవిష్యత్ తరాల కోసం సహజ వనరులను కాపాడాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడ్డారు.
తమ్మడి కుంట వంటి చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు, నాలాల పునరుద్ధరణ వంటి చర్యల వల్ల వర్షాకాలంలో నీటి నిల్వ, ముంపు సమస్యలు కొంత మేర తగ్గాయని స్థానికులు తెలిపారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని హైడ్రా చర్యలు నిరంతరం కొనసాగాలని వారు కోరారు.
ర్యాలీ ముగింపులో పాల్గొన్న ప్రజలు “హైడ్రా ఉండాల్సిందే”, “చెరువులను కాపాడితేనే నగరం సురక్షితం”, “ప్రజా ఆస్తులు ప్రజలకే” అంటూ నినాదాలు చేస్తూ హైడ్రాకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
