నగరాల కులానికి దక్కని ప్రాధాన్యం..!
- సంఘం అధ్యక్షుడు బాయన బాబ్జి (బాబుజి) ఆవేదన
భవానిపురం, ఆంధ్రప్రభ: నగరాల సామాజిక వర్గానికి రావాల్సిన రాజకీయ ప్రాధాన్యం ఇప్పటికీ దక్కడం లేదని, గతాన్ని గుర్తు చేసుకుంటూ కాలం గడపడం వల్ల ప్రయోజనం లేదని ఆంధ్రప్రదేశ్ నగరాల సంఘం అధ్యక్షుడు బాయన బాబ్జి (బాబుజి) ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం విజయవాడలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన నగరాల సంఘం సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నగరాల సామాజిక వర్గానికి గణనీయమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ, శాసనసభకు తమ వర్గానికి చెందిన అభ్యర్థిని నిలబెట్టే స్థాయికి చేరుకోలేకపోతున్నామని అన్నారు. రాజకీయ పార్టీల్లో చిన్నచిన్న పదవులు, దేవాలయాల పాలక మండళ్లలో సభ్యత్వాలతోనే సరిపెట్టుకుంటున్నామని, అయితే సమాజానికి అవసరమైంది బలమైన రాజకీయ నాయకత్వమని పేర్కొన్నారు.
ప్రజాప్రతినిధులు తమ కులానికి అనేక సేవలు చేశామని చెబుతున్నప్పటికీ, నగరాల వర్గానికి కావాల్సింది రాజకీయ ప్రాతినిధ్యం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యమేనని బాబ్జి అన్నారు. గత తరం నాయకుల పేర్లు చెప్పుకుంటూ ముందుకు సాగడం కంటే, రాబోయే తరానికి బలమైన నాయకత్వాన్ని అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
నగరాల కార్పొరేషన్ చైర్మన్ మరుపిల్ల తిరుమలేష్ అకాల మరణం అనంతరం ఆ పదవిని ఇప్పటికీ భర్తీ చేయకపోవడం విచారకరమని ఆయన విమర్శించారు. నగరాల కార్పొరేషన్ ప్రత్యేకంగా తమ కులానికి ఏర్పాటు చేయలేదని, అన్ని వర్గాల కోసం ఏర్పాటైన సంస్థేనని గుర్తుచేశారు.
ప్రజాప్రతినిధులను కలిసేందుకు కూడా తమ సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, ఇకపై నగరాల కులస్తులందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులు, రాజకీయ అవకాశాల కోసం సమిష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భావితరాల భవిష్యత్తు దృష్ట్యా యువతను రాజకీయంగా చైతన్యవంతం చేసి, బలమైన నాయకత్వాన్ని తయారు చేసే దిశగా కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.
