రోడ్డు భద్రతతో పాటు సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి..
- ఏసీపీ రామచంద్రరావు
మైలవరం, ఆంధ్రప్రభ : రహదారి భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, విద్యార్థులు చదువుపై ఏకాగ్రత పెంచుకుని సైబర్ మోసాలు, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మైలవరం ఉపవిభాగం ఇన్చార్జి సహాయ పోలీసు కమిషనర్ రామచంద్రరావు అన్నారు. మైలవరంలోని వివిఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని గోల్డెన్ అవర్లో ఆసుపత్రికి చేర్చిన వారికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రాహ్వీర్ పథకం కింద ₹25,000 ప్రోత్సాహకం అందజేస్తుందని తెలిపారు. బాధితులను ఆసుపత్రికి చేర్చిన వారిని పోలీసులు లేదా ఆసుపత్రి యాజమాన్యం ఎలాంటి ఇబ్బందులకు గురిచేయరని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు కొత్తూరు మాట్లాడుతూ.. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, బ్యాంకు వివరాలు, రహస్య సంఖ్యలు ఇతరులకు చెప్పరాదని, తెలియని లింకులను తెరవకూడదని సూచించారు. సామాజిక మాధ్యమాలకు అతిగా అలవాటు పడకుండా చదువుపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు సూచించారు. ఎస్ ఐ. సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, స్నేహభావంతో మెలుగుతూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను గౌరవించాలని, బాలల సంరక్షణ చట్టాలపై అవగాహన కలిగి చట్టవిరుద్ధ చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
