మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..
మెరసిన ఇంద్రకీలాద్రి ..వైభవంగా కార్తీక పౌర్ణమి వేడుకలు..
విజయవాడ, ఆంధ్రప్రభ : కార్తీక పౌర్ణమి వెలుగుల్లో ప్రదోషకాలంలో శ్రీ దుర్గా మల్లేశ్వరులకు దీపోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. కార్తీక దామోదరునికి ప్రీతిపాత్రమైన దీపోత్సవ దీప కాంతితో ఇంద్రకీలాద్రి(Indrakiladri) మెరిసింది. కనక దుర్గమ్మకు పంచహారతులు అనంతరం ఆలయప్రధాన రాజగోపురం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ(గాంధీ) దంపతులు, ఈవో వీకే శీనానాయక్ దంపతులు, ధర్మకర్తల మండలి సభ్యులు కోటి వత్తుల దీపాన్ని వెలిగించి హర హర మహా దేవ అంటూ మల్లేశ్వరస్వామిని కీర్తించారు.
ప్రధాన ఆలయం ప్రాంగణం, ఘాట్ రోడ్ వినాయక స్వామి ఆలయం, సుబ్రహ్మణ్యస్వామి, నటరాజస్వామిఆలయప్రాంగాణాల్లో, మల్లేశ్వరస్వామి(Malleswaraswamy) ఆలయప్రాంగణం, మహా మంటపం ముందు నుండి కనక దుర్గా నగర్ వరకు ఏర్పాటు చేసిన దీపాలను మొదటగా ఆలయఅర్చకులు పూజాకార్యక్రమం నిర్వహించి వెలిగించగా, భక్తులు మిగతా దీపాలు వెలిగించి దుర్గా మల్లేశ్వరులకు ప్రణతులు సమర్పించారు. భక్తుల భద్రత రీత్యా దేవస్థానంలో నాలుగు ప్రదేశాల్లో ప్రత్యేక వైద్య శిభిరాలు, అగ్నిమాపకశాఖ(Fire Department) వారి ఆధ్వర్యంలో యంత్రాలు ఏర్పాటు చేసినట్టు, వైదిక శాస్త్రోక్తంగా కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ తెలిపారు.
కార్తీక మాసంలో భక్తులకు విశేషఫలం అందించే దీపోత్సవం కార్యక్రమం ను ఆధ్యాత్మిక వైశిష్యం తో, ఆలయ స్థానాచార్య, వైదిక కమిటీ ఆధ్వర్యంలో సంప్రదాయబద్దంగా నిర్వహించినట్లు ఈవో శీనా నాయక్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలమండలి సభ్యులు బడేటి ధర్మారావు,గూడపాటి సరోజినీ దేవి,అవ్వారు శ్రీనివాసరావు, మోరు శ్రావణి, పి. రాఘవరాజు, ఎస్. సరిత, ప్రధాన అర్చకులు ఎల్. దుర్గా ప్రసాద్(L. Durga Prasad), ప్రత్యేక ఆహ్వానితులు వెలగపూడి శంకరబాబు, స్థానాచార్య వి. శివ ప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు శ్రీధర్ శర్మ తదితరులు పాల్గొన్నారు.


