ఘనంగా ప్రారంభమైన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలు..
మైలవరం, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అమరావతి ఛాంపియన్షిప్–2026 ద్వారా యువతలో క్రీడాస్ఫూర్తి, పోటీతత్వం పెంపొందుతాయని ఏసీపీ రామచంద్రరావు అన్నారు.
ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఏపీ) ఆధ్వర్యంలో మంగళవారం మైలవరం అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ఆయన ప్రారంభించి మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసి రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో అమరావతి ఛాంపియన్షిప్ను నిర్వహిస్తోందన్నారు. క్రీడాకారులు గెలుపు–ఓటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనాలని సూచించారు. క్రమశిక్షణ, ఆరోగ్యం, నాయకత్వ లక్షణాల పెంపునకు క్రీడలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.
నియోజకవర్గ స్థాయిలో నిర్వహించిన ఈ పోటీల్లో 12 క్రీడాంశాల్లో 650 మందికి పైగా విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాశాల క్రీడా మైదానం, డాక్టర్ లకిరెడ్డి హనుమిరెడ్డి క్రీడా ప్రాంగణంలో పోటీలను విజయవంతంగా నిర్వహించినట్లు పోటీల కన్వీనర్ మేడూరి రవికుమార్ తెలిపారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్ఐ సుధాకర్, తెలుగు యువత అధ్యక్షుడు లంక లితీష్, పోలీసు శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా రంగ ప్రతినిధులు పాల్గొని క్రీడాకారులను అభినందించారు. మైలవరం నియోజకవర్గంలోని వ్యాయామ ఉపాధ్యాయులు సమన్వయంతో పోటీల నిర్వహణలో విశేషంగా కృషి చేశారు.
జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి కాకర్ల కోటేశ్వరరావు పోటీల నిర్వహణను పరిశీలించారు. పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు స్థానిక ఎం.బి.ఎం. జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లు చేశారు.
ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన విద్యాసంస్థలు, అధికారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవకులు, నిర్వాహకులందరికీ పోటీల కన్వీనర్ మేడూరి రవికుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
