అంబాపురం గ్రామపంచాయతీలో పల్స్ పోలియో సందడి

ఆదర్శంగా నిలిచిన వైద్య సిబ్బంది…
ఉత్సాహంగా తరలివచ్చిన తల్లిదండ్రులు, చిన్నారులకు 100% పోలియో చుక్కలే లక్ష్యంగా సేవలు…

విజయవాడ రూరల్ (వెస్ట్), ఆంధ్రప్రభ : అంబాపురం గ్రామంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామపంచాయతీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్లతో ఘనంగా నిర్వహించారు. ‘పోలియో రహిత భారత్’ లక్ష్యంగా 5 సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో పంచాయతీ సిబ్బంది విస్తృత ఏర్పాట్లు చేశారు. గ్రామంలోని చిన్నారుల తల్లిదండ్రులు ఎంతో ఉత్సాహంగా పంచాయతీ కార్యాలయానికి తరలివచ్చి తమ పిల్లలకు పోలియో చుక్కలు వేయించారు.

ఏఎన్ఎం జయలక్ష్మి, ఎం ఎల్ హెచ్ ఓ కిరణ్మయి, హెచ్.వి మేరీ కిషోర్ చిన్నారులకు చుక్కల మందు వేసి తల్లిదండ్రులకు పోలియోపై అవగాహన కల్పించారు. ఆశా వర్కర్లు రత్నకుమారి, రాజామణి, అంగన్వాడీ టీచర్లు టి. సువార్తమ్మ, జి. సామ్రాజ్యం ఇంటింటికీ వెళ్లి ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా కేంద్రానికి రప్పించడంలో కీలకపాత్ర పోషించారు.‘నిండు జీవితానికి 2 చుక్కలు’ అనే నినాదంతో పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రం అందరినీ ఆకర్షించింది.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైద్య సిబ్బంది, ఆశా, అంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ సిబ్బందిని గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ప్రత్యేకంగా అభినందించారు. ప్రజారోగ్యం పట్ల అంబాపురం గ్రామపంచాయతీ చూపుతున్న చొరవ ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోందని స్థానికులు కొనియాడారు.