అత్కూరు అభివృద్ధికి రూ.100 కోట్ల పనులు మంజూరు
- ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు
ఉంగుటూరు, ఆంధ్రప్రభ : ఉంగుటూరు మండలం అత్కూరు గ్రామంలో మంగళవారం నిర్వహించిన “2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం” కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పాల్గొన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ గత రెండేళ్లలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాల వివరాలను కరపత్రాల ద్వారా ప్రజలకు వివరించారు. బూత్ స్థాయి కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్లి ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడుతూ అత్కూరు గ్రామ అభివృద్ధికి గత రెండేళ్లలో వివిధ శాఖల ద్వారా రూ.25.90 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసినట్లు తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.1.58 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించగా, విద్యుత్ శాఖ ద్వారా రూ.1.28 కోట్లతో తొమ్మిది కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కాలువల పూడికతీత, చెరువుల మరమ్మతుల కోసం రూ.15 లక్షలకు పైగా వ్యయం చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆర్‌అండ్‌బీ శాఖ ద్వారా ఏలూరు కాలువపై హై లెవల్ బ్రిడ్జి నిర్మాణం, భూసేకరణ పనుల కోసం రూ.20.75 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.

జల్ జీవన్ మిషన్ ద్వారా గ్రామంలో తాగునీటి సదుపాయాల కల్పనకు రూ.70 లక్షలు ఖర్చు చేసినట్లు వివరించారు. ప్రజల ఆరోగ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, నియోజకవర్గంలో ప్రయోగాత్మకంగా ఉచిత రక్త పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టి ఇప్పటివరకు పిహెచ్సి ల ద్వారా 25 వేల మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల ద్వారా మొత్తం 60 వేలకుపైగా రక్త పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో హెచ్‌సీఎల్ ఫౌండేషన్ సహకారంతో ఏఐ, మెషిన్ లెర్నింగ్, సెమీకండక్టర్ రంగాల్లో ఉచిత శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు.
ఈ కేంద్రం కోసం ప్రభుత్వం, హెచ్‌సీఎల్ ఫౌండేషన్ కలిసి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నాయని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రహదారుల పరిస్థితి దారుణంగా ఉండేదని, ప్రస్తుతం నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రహదారుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతాంగ ప్రయోజనాల కోసం ఏలూరు–పోలవరం కాలువల అనుసంధానానికి రూ.38 కోట్లు, ఏలూరు కాలువ–ఎనికేపాడు అండర్‌టన్నెల్ అభివృద్ధికి రూ.36 కోట్లు, అత్కూరు గ్రామానికి సంబంధించిన హై లెవల్ బ్రిడ్జి, భూసేకరణ పనులకు రూ.20.75 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. మొత్తంగా దాదాపు రూ.100 కోట్ల అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు.
ఈ నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతు సంక్షేమం కోసం తాను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన “రైతు నేస్తం” వంటి పథకాలు తర్వాత దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచాయని గుర్తుచేశారు. ప్రజలు ఓటు వేయలేదనే కక్షతో ఇచ్చిన మోటార్లను వెనక్కి తీసుకెళ్లిన చరిత్ర మాజీ శాసనసభ్యుడుదని అన్నారు. రైతులకు అవసరమైన మోటార్లను అందించేందుకు తాను స్వయంగా రూ.1.70 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధి, రైతుల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, విద్యా రంగ పురోగతే తన లక్ష్యమని, ప్రజల విశ్వాసానికి తగ్గట్టుగా మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.
కార్యక్రమంలో ఉంగుటూరు మండల ఎంపీడీఓ సత్యకుమార్, ఎమ్మార్వో విమల కుమారి, మండల టీడీపీ అధ్యక్షులు కొలుసు రవీంద్ర, అత్కూరు గ్రామ టిడిపి అధ్యక్షులు అట్లూరి రాంకిరణ్, ఆరుమళ్ళ కృష్ణారెడ్డి, కొండేటి వెంకటేశ్వరరావు, గూడపాటి తులసిమోహన్, గొడ్డళ్ల చిన్న రామారావు, మేడేపల్లి రమ, రాజబోయిన శివాజీ, దారం విజయ్, కుందేటి చంద్రశేఖర్, తమ్మిరెడ్డి సాంబశివరావు, నిమ్మకూరు మహేష్, పోతినేని రామకృష్ణ, అట్లూరి నాని, షేక్ ఫిరోజ్, ఎర్రగుంట్ల వినోద్, బోడపాటి రవికుమార్, గుజ్జర్లపూడి బాబురావు, బెజవాడ నాగేశ్వరరావు, మొవ్వ వెంకటేశ్వరరావు, జొన్నలగడ్డ సుధాకర్, పాలడుగు మల్లికార్జునరావు, చిలకపాటి శ్రీనివాసరావు, రాము, గొంగాడ సింహాచలం, పలగర సాంబశివరావు, గండికోట సీతయ్య, దేవరపల్లి వినీల్, మూల్పురి యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
