AP | 22-ఏ నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలి

రైతులకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలి
సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేసిన కేడీసీసీ చైర్మన్ నెట్టెం రఘురాం..
రెవెన్యూ అధికారులతో సమగ్రంగా పరిశీలించి న్యాయం చేస్తాం
సీఎం చంద్రబాబు హామీ


AP | (విజయవాడ ఆంధ్రప్రభ) : ఇన్నాం భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతూ కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెం రఘురాం మంగళవారం అమరావతిలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఈ సమస్యను మానవీయ దృక్పథంతో పరిశీలించి రైతులు, భూముల యజమానులకు శాశ్వత న్యాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ని కోరారు.

ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ గత ప్రభుత్వ హయాంలో ఇన్నాం భూముల సమస్య పరిష్కారానికి ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రపతి ఆమోదం పొందిన బిల్లును తీసుకువచ్చినప్పటికీ, 2019 ఎన్నికల కారణంగా ఆ బిల్లును శాసనసభలో చట్ట సవరణ రూపంలో ఆమోదింపజేయడం సాధ్యపడలేదని ముఖ్యమంత్రికి గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజకీయ కారణాలతో ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లకుండా నిర్లక్ష్యం చేసిందని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన అనంతరం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి, జి.ఓ. నెం.144ను జారీ చేసినప్పటికీ, ఇన్నాం భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించకపోవడంతో రైతులు, భూముల యజమానులు ఇప్పటికీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు.

ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మరోసారి సమావేశమై సమస్యను సమగ్రంగా పరిశీలించి, ఇన్నాం భూములను 22-ఏ నిషేధిత జాబితా నుంచి పూర్తిగా తొలగించి భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేలా అవసరమైన ఉత్తర్వులు జారీ చేయాలని వినతిపత్రంలో కోరినట్లు తెలిపారు. ఈ వినతిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారని, సంబంధిత రెవెన్యూ శాఖ అధికారులతో సమగ్రంగా పరిశీలించి రైతులకు న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు నెట్టెం రఘురాం వెల్లడించారు.