వర్షంలోనూ అప్రమత్తమే పసర పోలీసులు

జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు..

రహదారి భద్రతపై అవగాహన

గోవిందరావుపేట, ఆంధ్రప్రభ: ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణే లక్ష్యంగా పసర పోలీసులు నిరంతరం అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్నారని అధికారులు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

మంగళవారం 163వ జాతీయ రహదారిపై పసర పోలీస్ స్టేషన్ సమీపంలో ఎస్‌ఐ తాజుద్దీన్ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. వర్షం కురుస్తున్నప్పటికీ విధుల్లో అలసత్వం ప్రదర్శించకుండా తనిఖీలు చేపట్టారు.

ఈ సందర్భంగా వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, బీమా తదితర పత్రాలను పరిశీలించారు. అలాగే అనుమానాస్పద వ్యక్తులు, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా ఉంచుతూ వాహనదారులకు రహదారి భద్రతా నిబంధనలపై అవగాహన కల్పించారు.

ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. ప్రజల భద్రత కోసం ఎలాంటి పరిస్థితుల్లోనైనా అప్రమత్తంగా విధులు నిర్వహిస్తున్న పసర పోలీసుల సేవలను స్థానికులు అభినందించారు.

ఈ తనిఖీల్లో పసర సెకండ్ ఎస్‌ఐ రాజేందర్, పోలీసు సిబ్బంది ఎర్రయ్యతో పాటు కానిస్టేబుళ్లు పాల్గొన్నారు.