విద్యుత్ షాక్‌తో యువ రైతు మృతి

  • పంటకు నీరు పెట్టే క్రమంలో విషాదం
  • దామరంచపల్లి గ్రామంలో విషాద ఛాయలు

రేగొండ, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లి మండలం దామరంచపల్లి గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై యువ రైతు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కాడపాక సాగర్ తన వ్యవసాయ పొలంలో పంటకు నీరు పెట్టేందుకు మోటారు ఆన్ చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. వెంటనే గ్రామస్థులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు తెలిసింది.

యువ రైతు ఆకస్మిక మరణంతో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. దామరంచపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గ్రామ ప్రజలు, రైతులు, ప్రజాప్రతినిధులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు.