నకిలీ ధ్రువపత్రాల దందా బట్టబయలు

కళ్యాణలక్ష్మి–షాదీ ముబారక్ పథకాల పేరుతో మోసం.. ముగ్గురు అరెస్ట్

కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ: కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి అక్రమంగా లబ్ధి పొందుతున్న ముఠాను కామారెడ్డి పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, కంప్యూటర్ పరికరాలు, మొబైల్ ఫోన్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర తెలిపారు.

మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ నెల 22న జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో డాక్టర్ చందారి సంతోష్ తన పేరుతో నకిలీ సంతకాలు చేసి, అధికారిక రబ్బరు ముద్రను దుర్వినియోగం చేస్తూ వయస్సు, మొదటి వివాహ ధ్రువీకరణ పత్రాలు రూపొందించి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కింద ఉపయోగిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మధుసూదన్ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలతో విచారణ చేపట్టారు. భిక్కనూర్‌లోని లహరి జిరాక్స్ అండ్ ఆన్‌లైన్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహించి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో ప్రధాన నిందితులు తోడెంగల రాజా నరేందర్, తోడెంగల రాజలింగం తమ ఆన్‌లైన్ కేంద్రం ద్వారా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ దరఖాస్తుల కోసం అవసరమైన పత్రాలు సేకరించి, ఒక్కో దరఖాస్తుకు రూ.4,500 నుంచి రూ.5,000 వరకు వసూలు చేసినట్లు వెల్లడైంది.

ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న బోయిని ప్రసాద్‌తో కుమ్మక్కై ప్రభుత్వ వైద్యాధికారుల పేర్లతో నకిలీ సంతకాలు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు ఉపయోగించి వయస్సు, మొదటి వివాహ ధ్రువీకరణ పత్రాలతో పాటు ఇతర పత్రాలను తయారు చేసి, వాటిని అసలు ప్రభుత్వ పత్రాలుగా చూపిస్తూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించినట్లు విచారణలో తేలిందని ఎస్పీ తెలిపారు.

ఈ అక్రమాల ద్వారా ఇప్పటివరకు 32 మంది ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. అక్రమంగా సమర్పించిన దరఖాస్తుల సంఖ్య, ప్రభుత్వానికి జరిగిన ఆర్థిక నష్టం, లబ్ధిదారుల వివరాలు, ఇతరుల ప్రమేయంపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

నిందితుల వద్ద నుంచి కంప్యూటర్ సీపీయూ, ఎల్‌సీడీ మానిటర్, కీబోర్డ్, మౌస్, మూడు మొబైల్ ఫోన్లు, నకిలీ అధికారిక రబ్బరు ముద్రలు, స్టాంప్ ప్యాడ్, నకిలీ సంతకాలకు ఉపయోగించిన పెన్నులు, డిజిటల్ రికార్డులు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను అక్రమంగా వినియోగించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసును సాంకేతిక ఆధారాలతో ఛేదించిన డీఎస్పీ మధుసూదన్, టౌన్ ఎస్‌హెచ్‌ఓ నరహరి, దర్యాప్తు బృందాన్ని జిల్లా ఎస్పీ అభినందించారు.