అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలి
ఎస్ఐఆర్ ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలని అధికారులకు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి సూచన
కమ్మర్పల్లి, ఆంధ్రప్రభ: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, అర్హత కలిగిన ఏ ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు.
మంగళవారం కమ్మర్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆయన రెవెన్యూ అధికారులతో ఎస్ఐఆర్ నమోదు ప్రక్రియ పురోగతిపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ బూత్‌ల వారీగా ఓటర్ల నమోదు, మ్యాపింగ్, డిజిటలైజేషన్, ఏఎస్డీ (మరణించిన, డబుల్, శాశ్వతంగా మారిన ఓటర్లు) వివరాలను పరిశీలించారు.
ఎన్యూమరేషన్ ప్రక్రియ పూర్తయిందని అధికారులు వివరించగా, నమోదైన వివరాలను మరోసారి క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించాలని ఎమ్మెల్యే సూచించారు. ముఖ్యంగా ‘నో మ్యాపింగ్’, మరణించిన, డబుల్, శాశ్వతంగా మారిన ఓటర్లకు సంబంధించిన ప్రతి కేసును పునఃపరిశీలించి, ఎలాంటి పొరపాట్లు లేకుండా తుది నిర్ణయం తీసుకోవాలని కోరారు.
నియోజకవర్గంలో ప్రస్తుతం సగటున 89 శాతం మేర ఓటర్ల నమోదు, డిజిటలైజేషన్ పూర్తయిందని పేర్కొన్న ఆయన, ఈ శాతం కంటే తక్కువగా నమోదు జరిగిన పోలింగ్ బూత్‌ల జాబితాను సంబంధిత తహసీల్దార్లకు అందజేసినట్లు తెలిపారు. ఆయా బూత్‌లలో నమోదు శాతం ఎందుకు తగ్గిందో ప్రత్యేకంగా పరిశీలించి, మిగిలిన అర్హులైన ఓటర్లను గుర్తించి ఆగస్టు 3లోపు ఎన్యూమరేషన్ పత్రాలు అందజేసేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
2002 నుంచి ఇప్పటి వరకు ‘నో మ్యాపింగ్’ ఓటర్లు 5 శాతానికి మించి ఉన్న పోలింగ్ బూత్‌లు, అలాగే ‘పెర్మినెంట్ షిఫ్టెడ్’ ఓటర్లు 5 శాతానికి మించి నమోదైన బూత్‌లపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను కోరారు. సాంకేతిక లోపాలు, సమాచార పొరపాట్లు లేదా ఇతర కారణాలతో నిజమైన ఓటర్లకు అన్యాయం జరగకుండా మరోసారి క్షేత్రస్థాయిలో ధృవీకరణ చేపట్టాలని సూచించారు.
మండల కేంద్రాలు, గ్రామాల్లో ఇంకా నమోదుకాని అర్హులైన ఓటర్లను గుర్తించి, బీఎల్ఏలు, బీఎల్వోలు, రెవెన్యూ అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి వంద శాతం ఎన్యూమరేషన్ పూర్తి చేయాలని కోరారు.
“ఒక్క అర్హత కలిగిన ఓటరు కూడా నమోదు కాకుండా మిగలకూడదు. ప్రతి ఓటరి హక్కు పరిరక్షించబడాలి. అదే ప్రజాస్వామ్యానికి నిజమైన బలం” అని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, దానిని పరిరక్షించడం ప్రజాప్రతినిధుల బాధ్యత అని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, బాల్కొండ, మెండోరా మండలాల తహసీల్దార్లను కలిసి ఓటర్ల జాబితాలోని లోపాలు, సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ తరఫున వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో కూడా ఇదే విధంగా అధికారులను కలుస్తామని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు అందేలా బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
