సొత్తు రికవరీపై ప్రత్యేక దృష్టి.. సీసీఎస్‌కు పోలీస్ కమిషనర్ ఆదేశాలు

పాత నేరస్థుల కదలికలపై నిరంతర నిఘా ఉంచాలని సూచన

ఖమ్మం, ఆంధ్రప్రభ: నేరాల గుర్తింపు విషయంలో సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) మరింత సమర్థవంతంగా పని చేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. మంగళవారం నగరంలోని సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ను సందర్శించిన ఆయన, నేరాలు, దొంగతనాలు, దోపిడీలు తదితర కేసుల ఛేదనలో దర్యాప్తు అధికారులకు అందిస్తున్న సహాయాన్ని పరిశీలించారు.

అలాగే పాత నేరస్థుల కదలికలకు సంబంధించి ముందస్తు సమాచార సేకరణలో సీసీఎస్ పోలీసుల పనితీరును స్వయంగా సమీక్షించారు. నేరాల నియంత్రణలో సమాచార సేకరణ, విశ్లేషణ మరింత సమర్థంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, నేరాల ఛేదనలో కీలక పాత్ర పోషించే సీసీఎస్‌ను మరింత పటిష్ఠం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడతామని తెలిపారు. ముఖ్యంగా ప్రాపర్టీ రికవరీపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

వివిధ రకాల నేరాల నియంత్రణలో అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని ఆయన పేర్కొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.

దర్యాప్తు మరింత సమర్థంగా సాగేందుకు ప్రత్యేక క్రైమ్ బృందాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని అధికారులకు ఆదేశించారు. పాత నేరస్థుల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి, నేరాల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.