ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలి
వర్షపు నీటిని ఒడిసిపట్టేలా చర్యలు చేపట్టాలి: డీఆర్డీఓ విజయలక్ష్మి
కడెం, ఆంధ్రప్రభ: గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు ఇంకుడు గుంతల నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టాలని, భూగర్భ జలాల పెరుగుదలకు దోహదపడే పనులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్మల్ జిల్లా డీఆర్డీఓ విజయలక్ష్మి అధికారులను ఆదేశించారు.
మంగళవారం కడెం మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో చేపడుతున్న ఫార్మ్ పాండ్ పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యతను తనిఖీ చేసి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ, ఫార్మ్ పాండ్ పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా, పారదర్శకంగా చేపట్టి నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు. ప్రజలకు ఉపయోగపడే ప్రతి పనిని బాధ్యతాయుతంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, స్థానిక సర్పంచ్ స్పందన, ఏపీఓ జయదేవ్, గ్రామ కార్యదర్శి శాంత, టీఏలు కాంతారావు, గణేష్, ఎఫ్ఏ కమలాకర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
