బాసర మహంకాళి ఆలయ చోరీ కేసు ఛేదించిన పోలీసులు

ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలు సహా ముగ్గురి అరెస్ట్..

వెండి కిరీటం, నగదు స్వాధీనం

ఆంధ్రప్రభ, బాసర (నిర్మల్ జిల్లా): నిర్మల్ జిల్లా బాసరలోని ప్రసిద్ధ ఆలయ పరిధిలో ఉన్న మహంకాళి అమ్మవారి ఉపాలయంలో ఇటీవల జరిగిన చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు అంతర్‌జిల్లా దొంగలతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్ చేసి, దొంగిలించిన వెండి కిరీటం, వెండి పట్టి, నగదు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ జానకి షర్మిల కేసు వివరాలను వెల్లడించారు. గత నెల 22వ తేదీ రాత్రి మహంకాళి ఆలయ తాళాలు పగులగొట్టి, అమ్మవారి వెండి కిరీటంతో పాటు హుండీలోని నగదును దుండగులు అపహరించిన విషయం తెలిసిందే. ఈ ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేవలం పది రోజుల్లోనే నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

దర్యాప్తులో భాగంగా గుంటూరు జిల్లాకు చెందిన పల్లపు ఏడుకొండలు, నిజామాబాద్‌కు చెందిన గైని రామకృష్ణ చోరీకి పథకం రచించినట్లు గుర్తించారు. వీరిద్దరితో పాటు కొదమ ఆనంద్ అనే వ్యక్తి వద్ద దొంగిలించిన వెండి కిరీటం, వెండి పట్టి, నగదును దాచినట్లు పోలీసులు తెలిపారు.

దొంగిలించిన వెండి కిరీటం, వెండి పట్టిని మహారాష్ట్రలోని నాందేడ్‌లో విక్రయించేందుకు రైలులో వెళ్తుండగా బాసర రైల్వే స్టేషన్ వద్ద ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1 కిలో 220 గ్రాముల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టి, హుండీలోని రూ.16 వేల నగదు, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అదనపు ఎస్పీ తెలిపారు.

ప్రధానంగా రైల్వే సౌకర్యం ఉన్న ఆలయాలనే లక్ష్యంగా చేసుకుని ఈ ముఠా చోరీలకు పాల్పడుతున్నట్లు విచారణలో వెల్లడైందని ఆమె పేర్కొన్నారు.

ఈ కేసును వేగంగా ఛేదించిన ముధోల్ సీఐ రవీందర్ నాయక్, బాసర ఎస్‌హెచ్‌వో దీపక్, కానిస్టేబుళ్లు భీమేష్, రపతోళ్ల మోహన్తో పాటు దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా అదనపు ఎస్పీ జానకి షర్మిల అభినందించారు.