భూపాలపల్లికి చేరిన సీపీఎస్ ఉద్యోగుల జన జాగరణ యాత్ర
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్
భూపాలపల్లి, ఆంధ్రప్రభ: తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్‌ఈయూ) ఆధ్వర్యంలో చేపట్టిన 18వ రోజు ‘జన జాగరణ యాత్ర’ మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది.
యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, గడ్డం వెంకటేష్, చంద్రకాంత్, మహాదేవ్‌లకు భూపాలపల్లిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద జిల్లా అధ్యక్షుడు దిల్షాన్, రాష్ట్ర ఉపాధ్యక్షులు లింగమూర్తి, బుచ్చన్నతో పాటు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద కార్నర్ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ, గత 22 సంవత్సరాలుగా సీపీఎస్ విధానం కారణంగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 5 వేల మందికి పైగా ఉద్యోగులు పదవీ విరమణ చేసినప్పటికీ వారికి కనీస హామీ పెన్షన్ కూడా అందడం లేదన్నారు.
చివరి నెల జీతం రూ.91 వేలుగా ఉన్న ఒక ఉద్యోగికి పదవీ విరమణ అనంతరం కేవలం రూ.4,200 మాత్రమే పెన్షన్ రావడం సీపీఎస్ విధానంలోని లోపాలకు నిదర్శనమని పేర్కొన్నారు. సమాజానికి జీవితాంతం సేవలందించిన ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి రావడం బాధాకరమన్నారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రణాళికలో సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇప్పటికే పాత పెన్షన్ విధానం అమల్లో ఉందని, తెలంగాణలో కూడా వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఐక్యతను చాటేందుకు ఆగస్టు 23న నిర్వహించనున్న ‘చలో హైదరాబాద్’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల స్థాయి నాయకులు, పెద్ద సంఖ్యలో సీపీఎస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
