అనుమానిత ప్రాంతాలలో ఈగల్ టీం తనిఖీలు
ఇచ్చోడ, (ఆంధ్రప్రభ): జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ఈగల్ టీమ్ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ‘రోమా’ అనే స్నిఫర్ డాగ్‌తో కలిసి విద్యానగర్‌లోని కల్లు కాంపౌండ్, పల్లె ప్రకృతి వనం తదితర అనుమానిత ప్రాంతాలలో పోలీసులు ముమ్మర సోదాలు చేపట్టారు. మత్తు పదార్థాల రవాణా, విక్రయాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ తనిఖీలు సాగాయి.
అనంతరం ఇచ్చోడలోని ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్, కేజీబీవీ పాఠశాలలను ఈగల్ టీం సందర్శించింది. ఈ సందర్భంగా విద్యార్థులకు మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలపై ప్రత్యేక అవగాహన కల్పించారు. యువత, విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా సూచించారు.
ఈ తనిఖీలు మరియు అవగాహన కార్యక్రమంలో డాగ్ స్క్వాడ్ ఇన్‌ఛార్జ్‌తో పాటు ఈగల్ టీం సభ్యులు ఎస్. ప్రభాకర్ గౌడ్, రుక్మారెడ్డి, ఈశ్వర్ సింగ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
