అన్నారెడ్డిపాళెంలో ‘రెండేళ్ల నమ్మకం’ కార్యక్రమం..
- ప్రజల వద్దకు వెళ్లిన ప్రశాంతి రెడ్డి
విడవలూరు , ఆంధ్రప్రభ: విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంలో నిర్వహించిన ‘రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం’ కార్యక్రమంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ వెళ్లి కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేసిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని ఆమె పేర్కొన్నారు. అందుకే ప్రజల ముందుకు ధైర్యంగా, తలెత్తుకుని వెళ్లగలుగుతున్నామని అన్నారు.
అన్నారెడ్డిపాళెం గ్రామ అభివృద్ధి కోసం ఇప్పటికే రూ.1.64 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టినట్లు ప్రశాంతి రెడ్డి తెలిపారు. గ్రామంలో మిగిలి ఉన్న సీసీ డ్రెయిన్ల నిర్మాణంతో పాటు ప్రజలు ప్రస్తావించిన ఇతర సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని చెప్పారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తయిన తర్వాతే మళ్లీ గ్రామానికి వస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.
అనంతరం విడవలూరులో జరుగుతున్న శ్రీ అంకమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు. ప్రత్యేక అభిషేకంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులు ప్రతి కుటుంబంపై ఉండాలని, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.
