మధుసూదనాచారిపై విమర్శలు మానుకోవాలి: బీఆర్ఎస్ నేతల హెచ్చరిక

భూపాలపల్లి, ఆంధ్రప్రభ: మాజీ శాసనసభాపతి, బీఆర్ఎస్ సీనియర్ నేత సిరికొండ మధుసూదనాచారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని, లేకుంటే రాజకీయంగా తగిన సమాధానం ఇస్తామని బీఆర్ఎస్ ఉద్యమకారులు, నాయకులు హెచ్చరించారు. భూపాలపల్లిలోని ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి వర్గంపై విమర్శలు గుప్పించారు. మధుసూదనాచారి ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే అంశాన్ని పార్టీ అధిష్ఠానం, కేసీఆర్, కేటీఆర్ నిర్ణయిస్తారని, సర్వే నివేదికల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పాటులో మధుసూదనాచారి కీలక పాత్ర పోషించారని, ఆయనను విమర్శించడం ఉద్యమ చరిత్రను అవమానించడమేనని అన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమకారులపై కేసులు పెట్టించడం, భూకబ్జాలు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆయన అనుచరులపై ఆరోపణలు చేశారు. భూపాలపల్లి అభివృద్ధికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల కోరిక మేరకే మధుసూదనాచారి రాజకీయాల్లో చురుకుగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్‌లో ఉండి పార్టీని దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరిస్తూ, రానున్న ఎన్నికల్లో మధుసూదనాచారిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు సమిష్టిగా పనిచేస్తాయని తెలిపారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు లెంకల రాజిరెడ్డి, రత్నం రవి, చింతల రమేష్, మునుకుంట్ల వెంకటేష్, బండారు రవి, ముద్దసాని కిరణ్, ఏదుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.