బాధ్యతాయుతంగా పని చేయాలి..

బాధ్యతాయుతంగా పని చేయాలి..
సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించాలన్నవరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్
వరంగల్ పోలీస్ రేంజ్ నూతన భవనంను ప్రారంభించిన సీపీ
వరంగల్ క్రైమ్, ఆంధ్రప్రభ : పోలీస్ అధికారుల శాఖ పరమైన సమస్యలపై రెంజ్ కార్యాలయ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశించారు.పరిపాలన పనితీరులో పారదర్శకంగానే కాక బాధ్యతాయుతమైన పని తీరు ఉండాలన్నారు. కర్తవ్య నిర్వహణలో ఉండే పోలీసు అధికారులు,సిబ్బందిని ఇబ్బందులు పెట్టె ప్రయత్నాలు చేయోద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.
నూతనంగా ఏర్పాటు చేసిన వరంగల్ పోలీస్ రేంజ్ పరిపాలన కార్యాలయ భవనాన్ని శనివారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ప్రారంభించారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్ హౌస్ రోడ్లో ఏర్పాటు చేసిన నూతన వరంగల్ పోలీస్ రెంజ్ కార్యాలయంలో వరంగల్ రెంజ్ పోలీస్ అధికారులకు సంబందించిన శాఖ పరమైన పరిపాలన కార్యకలాపాలు ఈ భవనం నుండి కొనసాగ నున్నాయి.ఈ నూతన కార్యాలయంను ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కార్యాలయంలోని వసతులు,సదుపాయాలను పరిశీలించారు. వరంగల్ రేంజ్ ఆఫీస్ స్టాఫ్ పనితీరులో బెస్ట్ గా నిలువాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సూచించారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ డీసీపీలు దార కవిత, అంకిత్ కుమార్, అదనపు డీసీపీలు సురేష్ కుమార్, శ్రీనివాస్,రాయల ప్రభాకర్ రావు, రేంజ్ కార్యాలయం సూపరింటెండెంట్ యుగేందర్, ఏసీపీలు సత్యనారాయణ, నర్సింహా రావు, సురేంద్రతో పాటు ఆర్. ఐలు, ఇన్స్ పెక్టర్లు ఇతర రెంజ్ కార్యాలయ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
