గజరం దొడ్డి బ్రిడ్జి కమ్ బారేజ్ పనుల్లో వేగం పెంచాలి

రూ.20 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పనులను పరిశీలించిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి

మక్తల్, ఆంధ్రప్రభ: గజరం దొడ్డి రోడ్డు కమ్ బ్రిడ్జి కమ్ బారేజ్ నిర్మాణ పనుల్లో మరింత వేగం పెంచాలని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అధికారులను ఆదేశించారు.

మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని చిట్యాల గ్రామం వద్ద వాగుపై రూ.20 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చిట్యాల–గజరం దొడ్డి బ్రిడ్జి కమ్ బారేజ్ పనులను మంత్రి పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్మాణ పనుల నాణ్యతను పరిశీలించిన మంత్రి, సంబంధిత అధికారులను అడిగి పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి వంతెనను వీలైనంత త్వరగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లు, ఇంజినీర్లకు సూచించారు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ వంతెన నిర్మాణం చేపడుతున్నామని అధికారులు మంత్రికి వివరించారు.

దశాబ్దాలుగా గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా చిట్యాల నుంచి గజరం దొడ్డి, మందిపల్లి, కొల్పూరు, ముడుమాల్ తదితర గ్రామాలకు వెళ్లే ప్రజలు వాగు కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మంత్రి తెలిపారు. వర్షాకాలంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయేవని, రైతులు తమ వ్యవసాయ పొలాలకు వెళ్లలేక ఇబ్బందులు పడాల్సి వచ్చేదని గుర్తు చేశారు.

ప్రజలు, రైతుల సమస్యలను పరిష్కరించేందుకే ప్రజా ప్రభుత్వం చిట్యాల–గజరం దొడ్డి రోడ్డు కమ్ బారేజ్ నిర్మాణానికి రూ.20 కోట్లు కేటాయించిందని తెలిపారు. పనుల్లో మరింత వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రైతులతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు చిట్యాల, గజరం దొడ్డి మీదుగా కర్ణాటకలోని రాయచూరుకు సులభంగా వెళ్లే అవకాశం కలుగుతుందని మంత్రి పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల గ్రామ సర్పంచ్ రహమత్ పాషా, నాయకులు ఆనంద్ గౌడ్, శివరాం రెడ్డి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.