పారదర్శకంగా ఓటరు నమోదు చేపట్టాలి: నాగం వర్షిత్ రెడ్డి

చౌటుప్పల్, ఆంధ్రప్రభ: ఓటరు నమోదు ప్రక్రియను పూర్తిస్థాయిలో పారదర్శకంగా నిర్వహించి, నిజమైన అర్హులైన ఓటర్లను మాత్రమే జాబితాలో చేర్చాలని బీజేపీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. మంగళవారం చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 19వ వార్డు, 39వ బూత్‌లో జరుగుతున్న ఎస్‌ఐఆర్ (ప్రత్యేక ఓటరు నమోదు) ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక బీఎల్‌వో బుచ్చిరాములతో మాట్లాడిన ఆయన, ఓటరు జాబితా రూపకల్పనలో నిజాయితీ, నిబద్ధతతో వ్యవహరించాలని సూచించారు.

స్థానికంగా నివాసం లేని బోగస్ ఓటర్లను గుర్తించి జాబితా నుంచి తొలగించాలని, చట్టబద్ధమైన అర్హులకే ఓటు హక్కు కల్పించేలా బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపల్ అధ్యక్షురాలు కడారి కల్పన ఐలయ్య యాదవ్, మాజీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకరయ్య, ఫ్లోర్ లీడర్ బుడ్డ సురేష్, పలువురు నాయకులు, బీఎల్‌ఏ-2లు, బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.