ఒక్క అండర్‌పాస్ కోసం రోడ్డెక్కిన గ్రామస్తులు..!

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : ఎల్కతుర్తి మండలంలోని శాంతినగర్ స్టేజి వద్ద విద్యార్థులు, గ్రామస్తులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఎన్‌హెచ్–563 జాతీయ రహదారి విస్తరణలో భాగంగా గ్రామానికి వెళ్లే మార్గంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామానికి చేరుకోవాలంటే కోతులనడుమ లేదా పెంచికలపేట మీదుగా వెళ్లాల్సి వస్తోందని, దీంతో విద్యార్థులు, ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే డైవర్షన్‌గా అండర్‌పాస్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఆందోళనకారులతో మాట్లాడి పరిస్థితిని చక్కదిద్దారు. అనంతరం ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.