Banswada Maternity Hospital | బాన్సువాడలో ఇద్దరు స్టాఫ్ నర్సులు సస్పెండ్..

మత్తు వైద్యుడిపై వేటు.. విచారణ కమిటీ ఏర్పాటు

Banswada Maternity Hospital | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మాతా–శిశు ఆసుపత్రిలో ఐదుగురు బాలింతలు అస్వస్థతకు గురైన ఘటనను వైద్య, ఆరోగ్యశాఖ తీవ్రంగా పరిగణించింది. ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ చేయడంతో పాటు బాధ్యులపై తొలి దశలో కఠిన చర్యలు చేపట్టింది. ఆపరేషన్ సమయంలో విధుల్లో ఉన్న ఇద్దరు స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే విధులు నిర్వహించిన అనస్థీషియా వైద్యుడు సేవల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఘటనకు గల కారణాలను సమగ్రంగా వెలికితీసేందుకు ప్రత్యేక విచారణ కమిటీని నియమించిన వైద్యశాఖ, కమిటీ నివేదిక ఆధారంగా బాధ్యులపై మరిన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవల నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు.