సర్ అమలు సమయంలో డిప్యూటేషన్లు
- వైరా మండల పరిషత్ అధికారుల నిర్వాహకం
- కలెక్టర్ సూచనలతో అంటూ ఉత్తర్వులు జారీ
- వెంటనే ఉత్తర్వులు రద్దు చేసిన వైనం
వైరా, ఆంధ్రప్రభ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రతిష్టాత్మకంగా అమలవుతున్న సమయంలో వైరా మండలంలోని రెండు గ్రామాల్లో బిఎల్వోలుగా ఉన్న గ్రామ కార్యదర్శులకు డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేయటం చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్ సూచనలతో డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు వైరా మండల అధికారులు పేర్కొనటం విశేషం. అయితే చివరకు బిఎల్వోలుగా ఉన్న గ్రామ కార్యదర్శులకు ఇచ్చిన డిప్యూటేషన్ ఉత్తర్వులు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. వైరా మండలంలోని పుణ్య పురం గ్రామ కార్యదర్శిగా సిహెచ్ నాగేశ్వరరావు, గన్నవరం గ్రామ కార్యదర్శిగా శ్యామ్ భాను పనిచేస్తున్నారు.
అయితే సోమవారం రాత్రి వైరా ఎంపీడీవో సక్రియ కలెక్టర్ సూచనలతో ఈ ఇద్దరు గ్రామ కార్యదర్శులను డిప్యూటేషన్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పుణ్య పురం గ్రామ కార్యదర్శిగా ఉన్న సిహెచ్ నాగేశ్వరావును గన్నవరం గ్రామ కార్యదర్శిగా, గన్నవరం గ్రామ కార్యదర్శిగా ఉన్న శ్యామ్ భానును పుణ్య పురం గ్రామర్ కార్యదర్శిగా నియమిస్తూ డిప్యూటేషన్ ఉత్తర్వులను సోమవారం రాత్రి జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సర్ కార్యక్రమం సెప్టెంబర్ 1వ తేదీ వరకు కొనసాగుతుంది. సర్ అమలు సమయంలో బిఎల్వోలుగా ఉన్న గ్రామ కార్యదర్శులను బదిలీ చేయకూడదని, డిప్యూటేషన్ పై పంపకూడదని ఇప్పటికే కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
అయితే అందుకు విరుద్ధంగా వైరా మండలంలో ఇద్దరు కార్యదర్శులను మండల అధికారులు డిప్యూటేషన్ చేసి కలెక్టర్ ఆదేశాలను బేఖాతర్ చేశారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ విషయాన్ని తెలుసుకున్న వైరా తహసిల్దార్ వెంటనే ఎంపీడీవోతో మాట్లాడారు. సర్ అమలు సమయంలో బిఎల్వోలుగా ఉన్న గ్రామ కార్యదర్శులను డిప్యూటేషన్ చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయని తహాసిల్దార్ ఎంపీడీవోకు స్పష్టం చేశారు. దీంతో వెంటనే ఎంపీడీవో ఆ డిప్యూటేషన్ ఉత్తర్వులను రద్దు చేశారు.
కలెక్టర్ సూచనలతో అంటూ డిప్యూటేషన్ ఉత్తర్వులను జారీ చేయటం, వెంటనే వాటిని రద్దు చేయటం ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తుంది. ఈ విషయమై వైరా ఎంపీడీవో సక్రియను వివరణ కోరగా మండలంలోని ఇద్దరు గ్రామ కార్యదర్శులకు కలెక్టర్ ఆదేశాలతో పరిపాలనా సౌలభ్యం కోసం డిప్యూటేషన్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం వాస్తవమేనని అంగీకరించారు. అయితే సర్ ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో బిఎల్వోలుగా ఉన్న గ్రామ కార్యదర్శులను డిప్యూటేషన్ పై పంపితే ఇబ్బందులు ఎదురవుతాయని తహసిల్దార్ విజ్ఞప్తి చేయటంతో జారీ చేసిన డిప్యూటేషన్ ఉత్తర్వులను రద్దు చేశామని స్పష్టం చేశారు.
