ప్రజల గడపలోకి ఎమ్మెల్యే కొలికపూడి
- ‘ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమంలో ప్రజా సమస్యలపై ఆరా
- ఉమ్మడి దేవరపల్లిలో ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలపై అవగాహన
- రెండేళ్ల అభివృద్ధి పనులను వివరించిన ఎమ్మెల్యే శ్రీనివాసరావు
- ప్రజల సమస్యల పరిష్కారానికి అధికారులతో సమన్వయం చేస్తామని హామీ
- మైటీడీపీ యాప్లో ప్రతి ఇంటి వివరాలు నమోదు చేయాలని కార్యకర్తలకు సూచన
గంపలగూడెం, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ‘ఇంటింటికి తెలుగుదేశం పార్టీ’ కార్యక్రమంలో భాగంగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు సోమవారం గంపలగూడెం మండలం ఉమ్మడి దేవరపల్లి గ్రామంలో ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకున్నారు. ప్రతి కుటుంబాన్ని నేరుగా కలిసి వారి సమస్యలు, అవసరాలు, అభిప్రాయాలను తెలుసుకుంటూనే కూటమి ప్రభుత్వం రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
ఇంటి ఇంటికీ వెళ్లిన ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పారదర్శక పాలన, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, యువతకు ఉపాధి కల్పన వంటి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. ఎన్నికల హామీల్లో భాగమైన ‘సూపర్ సిక్స్’ పథకాల అమలు, అర్హులైన కుటుంబాలకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి వివరించి ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన కల్పించారు. తిరువూరు నియోజకవర్గంలో గత రెండేళ్లుగా చేపట్టిన రహదారుల నిర్మాణం, తాగునీటి సౌకర్యాల కల్పన, విద్యా, వైద్య రంగాల అభివృద్ధి, గ్రామాభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు, నియోజకవర్గానికి తీసుకొచ్చిన నిధుల వివరాలను ఎమ్మెల్యే ప్రజలకు వివరించారు. కొనసాగుతున్న అభివృద్ధి పనులను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా ప్రజలు వినిపించిన సమస్యలను ఓర్పుగా విన్న ఎమ్మెల్యే, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అదేవిధంగా, ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటి సందర్శన వివరాలు, ప్రజల అభిప్రాయాలు, సమస్యలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి సమాచారాన్ని మైటీడీపీ యాప్లో తప్పనిసరిగా నమోదు చేయాలని పార్టీ శ్రేణులకు ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కుటుంబానికి చేరవేయడంతో పాటు ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలను మరింత బలోపేతం చేసే వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యువత, మహిళలు, అభిమానులు, గ్రామ పెద్దలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
