క్యాన్సర్ బాధితుడికి అండగా…

క్యాన్సర్ బాధితుడికి అండగా…
మచిలీపట్నం – ఆంధ్రప్రభ : స్థానిక చింతకుంటపాలెం (జమ్మలమడుగు స్ట్రీట్) నివాసి, నిరుపేద చేనేత కార్మికుడు శ్రీ నాసిక వెంకటేశ్వరరావు గారికి మచిలీపట్నం మైత్రి ఫౌండేషన్ బాసటగా నిలిచింది. గత కొంతకాలంగా గొంతు క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయనకు ఒక నెలకు సరిపడా మందుల ఖర్చు నిమిత్తం రూ.8,000/- ఆర్థిక సాయాన్ని శనివారం ఫౌండేషన్ ప్రతినిధులు అందజేశారు.
ప్రస్తుతం విజయవాడలోని నాగార్జున క్యాన్సర్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వెంకటేశ్వరరావుకు ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం అందుతున్నప్పటికీ, మందుల కోసం ప్రతి వారం సుమారు రూ2,000/- ఖర్చవుతోంది. కేవలం ప్రభుత్వ పెన్షన్‌పైనే ఆధారపడి బతుకుతున్న ఆ కుటుంబ పరిస్థితిని గమనించిన మైత్రి ఫౌండేషన్ తక్షణ సాయంగా ఈ మొత్తాన్ని చెక్కు రూపంలో వారి నివాసానికి వెళ్లి అందజేసింది.
కష్టాల్లో ఉన్న పేదలకు తోడుగా నిలవడమే తమ సంస్థ ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా అధ్యక్షుడు వేణు కుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు వేణు కుమార్, కార్యదర్శి రాధాకృష్ణ, ఫుడ్ కమిటీ చైర్మన్ అనిల్, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.
