వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమంలో భవ్యశ్రీకి ప్రధాని ప్రశంసలు

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో: సరిహద్దు గ్రామాలను దేశానికి చివరి గ్రామాలుగా కాకుండా తొలి గ్రామాలుగా చూడాలని, అక్కడి ప్రజల జీవన విధానం, దేశభక్తి, సంస్కృతిని యువత ప్రత్యక్షంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమాన్ని చేపట్టామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. దేశవ్యాప్తంగా 250 జిల్లాలకు చెందిన యువతతో ఆదివారం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాకు చెందిన యువతి భవ్యశ్రీతో ప్రత్యేకంగా సంభాషించి ఆమె అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. ముందుగా భవ్యశ్రీని పరిచయం చేసుకోవాలని కోరిన ప్రధాని, ఆమె ఏ గ్రామానికి వెళ్లిందో, ఈ కార్యక్రమానికి ఎలా ఎంపికైందో, వెళ్లేముందు ఎలాంటి సందేహాలు ఉన్నాయో ప్రశ్నించారు.

దీనికి భవ్యశ్రీ స్పందిస్తూ, చదువుతో పాటు కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తితో మై భారత్ వేదికలో చేరి వివిధ క్విజ్‌లలో పాల్గొనడం ద్వారా ఈ కార్యక్రమానికి ఎంపికయ్యానని తెలిపారు. ఉత్తరాఖండ్‌లోని హర్షిల్ లోయకు వెళ్లేముందు అక్కడి వాతావరణం, ఆహారం, సంస్కృతి గురించి కొంత భయంగా అనిపించినా, అక్కడి ప్రజలు, అధికారులు ఎంతో ఆప్యాయంగా స్వాగతించడంతో ఆ భయం పూర్తిగా తొలగిపోయిందన్నారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసు దళం సిబ్బందిని కలుసుకుని వారి క్రమశిక్షణ, దేశభక్తి, సేవా తత్వాన్ని చూసి భారతీయురాలిగా ఎంతో గర్వంగా అనిపించిందని భవ్యశ్రీ చెప్పారు. ముఖ్వా గ్రామంలోని హోమ్‌స్టేలో బస చేసిన సమయంలో స్థానిక కుటుంబ సభ్యులు తమ ఇంటి వారిలా చూసుకున్నారని, కేవలం ఏడు రోజుల్లోనే సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కలిగిందని వివరించారు.

దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన యువతతో కలిసి ఒక కుటుంబంలా మమేకమయ్యామని, అదే ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ భావనకు నిదర్శనమని పేర్కొన్నారు. హర్షిల్ ప్రాంత యువతకు మై భారత్ గురించి వివరించడంతో పాటు, తాను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్న ఫొటోలు, వీడియోలు చూసి తన స్నేహితులు కూడా ఈ కార్యక్రమంపై ఆసక్తి చూపి నమోదు చేసుకున్నారని తెలిపారు. హర్షిల్‌లోని 5 డిగ్రీల చలిని మొదట భయపడ్డప్పటికీ, నిర్వాహకులు అందించిన ఉన్ని దుస్తులు, జాకెట్లు, గ్లౌజులు, టోపీలతో ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెప్పారు. అక్కడి ప్రజల జీవనశైలి గురించి వివరిస్తూ, కొండచరియలు విరిగిపడే ప్రమాదాలు ఉన్నప్పటికీ ఇది మా స్వస్థలం… మేము వెళ్లిపోతే ఇక్కడ ఎవరు ఉంటారు? అని వారు చెప్పిన మాటలు తనను ఎంతో ప్రభావితం చేశాయని భవ్యశ్రీ తెలిపారు.

కష్టాల్లోనూ ధైర్యంగా జీవించడం వారిని చూసి నేర్చుకున్న గొప్ప పాఠమని అన్నారు. గఢ్వాలి సంప్రదాయ నృత్యంలో పాల్గొనడం ద్వారా అక్కడి సంస్కృతిని దగ్గరగా అనుభవించానని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ రాజకీయాల్లోకి రాకముందే సరిహద్దు గ్రామాలను సందర్శించే అవకాశం తనకు లభించిందని, ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రతి ఏడాది సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నానని తెలిపారు. సరిహద్దు గ్రామాలు దేశానికి తొలి గ్రామాలని, అక్కడి ప్రజలు సౌకర్యాల కంటే దేశ ప్రయోజనానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని కొనియాడారు. యువతను దేశ నిర్మాణంలో భాగస్వాములను చేయాలనే ఉద్దేశంతో “మై భారత్” వేదికను ప్రారంభించామని, దాని ద్వారా కోట్లాది మంది యువత దేశవ్యాప్తంగా అనుసంధానమయ్యారని ప్రధాని పేర్కొన్నారు.

హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, లడఖ్ వంటి సరిహద్దు ప్రాంతాల్లోని జీవన విధానం, సంస్కృతి, ఉపాధి అవకాశాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశాన్ని వికసిత్ వైబ్రెంట్ విలేజ్ కార్యక్రమం కల్పిస్తోందని వివరించారు. వికసిత్ భారత్ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని, సరిహద్దు గ్రామాల ప్రజల్లో కనిపించే దేశభక్తి, సేవా భావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధాని అన్నారు. భవ్యశ్రీలో కనిపించిన ఏక్ భారత్–శ్రేష్ఠ భారత్ స్ఫూర్తిని అభినందించిన ఆయన, ఆమె పంచుకున్న అనుభవాలు మరెందరో యువతను మై భారత్ కార్యక్రమంలో చేరేలా ప్రేరేపించడం ఆనందదాయకమని పేర్కొంటూ శుభాకాంక్షలు తెలిపారు.